భార్యపై, తండ్రిపై అక్రమ సంబంధం ఉందని అనుమానం: గన్ తీసుకుని మరీ దారుణానికి ఒడిగట్టిన కొడుకు!

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. తన భార్యకు, తన సొంత తండ్రితో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన ఒక వ్యక్తి, కోపంతో కన్న తండ్రిని, కట్టుకున్న భార్యను కాల్చి చంపాడు.

ఈ ఘటన బులంద్‌షహర్‌లోని ఖుర్జా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఏం జరిగింది? నిందితుడిని మోమిన్ అని గుర్తించారు. మోమిన్ తన తండ్రి రియాజుద్దీన్‌ను మరియు భార్య సనాను తుపాకీతో కాల్చి చంపాడు. తండ్రి రియాజుద్దీన్‌కు రెండు బుల్లెట్లు తగిలి అక్కడికక్కడే మరణించగా, భార్య సనా తీవ్రంగా గాయపడింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె కూడా మరణించింది.

అనుమానమే కారణం: పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో, భార్యకు, తన తండ్రికి మధ్య అక్రమ సంబంధం ఉందని మోమిన్ బలంగా అనుమానించినట్లు తేలింది. ఈ విషయంలో కుటుంబంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇరుగుపొరుగు వారు, బంధువులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా, మోమిన్ కోపం తగ్గలేదు. ఆవేశంలో తన తండ్రికి చెందిన లైసెన్స్డ్ తుపాకీతోనే వారిద్దరిపై కాల్పులు జరిపి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

ఎస్ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, “నిందితుడు మోమిన్‌ను అదుపులోకి తీసుకున్నాము. హత్యకు ఉపయోగించిన పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నాము. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నాము” అని తెలిపారు.


Posted

in

by

Tags: