అమెరికాలో జరిగిన ఈ నిజ జీవిత ఉదంతం ఒక హారర్ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఒక యువతి తన జ్ఞాపకశక్తిని కోల్పోయిన సమయాన్ని ఆసరాగా చేసుకుని, ఒక దుండగుడు ఆమెను ప్రాణాలతో లేకుండా చేసేందుకు పన్నిన కుట్ర అందరినీ నివ్వెరపరుస్తోంది.
ఏం జరిగింది? 2015లో బ్రూక్ అనే యువతి 20 అడుగుల ఎత్తు నుండి పడి తీవ్రంగా గాయపడింది. తలకు బలమైన గాయం కావడంతో ఆమె జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోయి, 10 రోజుల పాటు కోమాలో ఉంది. స్పృహలోకి వచ్చిన తర్వాత, ఆమెకు తన గతం ఏమాత్రం గుర్తులేదు. ఆ సమయంలోనే ఒక అపరిచిత వ్యక్తి ఆమె మంచం దగ్గరకు వచ్చి, తాను నీకు బాయ్‌ఫ్రెండ్‌ని అని అబద్ధం చెప్పాడు.
అసహాయతను ఆసరాగా చేసుకుని.. “నేను డాక్టర్లకు, సిబ్బందికి నువ్వు నా ప్రేయసివని చెప్పాను, ఇది నీకు ఓకే కదా? మనం అంతకుముందు కలిసి ఉండకపోవచ్చు, కానీ ఇప్పటి నుండి మనం జంటగా ఉంటాం” అని ఆ దుండగుడు ఆమెను నమ్మించాడు. జ్ఞాపకశక్తి లేని బ్రూక్ ఆ మాటలను నిజమని నమ్మి, అతడి చేతిలో పావుగా మారింది. అతను ఆమెను తన నియంత్రణలో ఉంచుకుంటూ, ఇబ్బందికరమైన పనులు చేయమని ఒత్తిడి తెచ్చేవాడు.
మిత్రురాలి రాకతో బయటపడిన అసలు నిజం: కొన్ని వారాల తర్వాత, బ్రూక్ ప్రాణ స్నేహితురాలు విదేశాల నుండి తిరిగి వచ్చి, ఆసుపత్రిలో వారిద్దరిని చూసి షాక్ అయింది. ఆ వ్యక్తి ఎవరో కాదు.. ఒక సంవత్సరం క్రితం బ్రూక్ స్నేహితురాలిపై లైంగిక దాడికి పాల్పడిన నేరస్తుడు. ఆ ఘటనను కళ్లారా చూసిన బ్రూక్ సాక్షిగా ఉంది. తనపై ఉన్న కేసును మరుగున పడేయడానికి, బ్రూక్ గతాన్ని మర్చిపోయిందన్న విషయాన్ని గమనించి, ఆమెను మభ్యపెట్టి దగ్గరయ్యాడు.
హత్యాయత్నం.. బ్రూక్ కోమాలో ఉన్నప్పుడు కూడా ఆ దుండగుడు ఆమె మంచం వద్దకు వచ్చి, “ఆమె కోలుకోవడం లేదు, వెంటిలేటర్ తీసేయండి” అని డాక్టర్లను కోరాడు. అంటే, బ్రూక్‌ను అక్కడికక్కడే అంతం చేయాలని ప్లాన్ చేశాడు. స్నేహితురాలి రాకతో తన నిజస్వరూపం బయటపడటంతో, అతను భయపడి అక్కడి నుండి పారిపోయాడు. ఆ తర్వాత బ్రూక్ న్యాయపరమైన సహాయంతో ఆ నేరస్తుడి నుండి బయటపడింది.
