“నువ్వు బీహార్ నుంచి వచ్చావు కదా, నీకు సరిగ్గా మాట్లాడటం కూడా రాదు. ఢిల్లీ లేదా గురుగ్రామ్‌లో ఉద్యోగం చేయడానికి నీకేం అర్హత ఉంది? ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిపో!” అంటూ ఒక యువకుడిపై తీవ్రమైన భాషా వివక్షతో కూడిన దాడి జరిగింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని గురుగ్రామ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేవలం బీహార్‌కు చెందినవాడనే కారణంతో ఒక యువకుడిని కిరాతకంగా కొట్టడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఏం జరిగింది? బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లా, సండేరా గ్రామానికి చెందిన ఆదిత్య రాజ్ పాండే గురుగ్రామ్‌లో అద్దెకు ఉంటున్నారు. ఆయన సెక్టార్-48లోని కాండర్ టెక్‌స్పేస్‌లో టెలిపర్‌ఫార్మెన్స్‌లో పనిచేస్తున్నారు. మే 20న తన సహోద్యోగి అన్ష్ త్యాగి పిలవడంతో, DLF ఫేజ్-3లోని ఒక గదికి వెళ్లారు. అక్కడ అన్ష్‌తో పాటు జోయెల్ కె. జోస్, ఉదయ్ సన్సన్‌వాల్, నిఖిల్ సన్సన్‌వాల్ మరియు ఒక యువతి ఉన్నారు.
మే 21 అర్ధరాత్రి 2 గంటల సమయంలో, మద్యం మత్తులో ఉన్న ఉదయ్, నిఖిల్.. ఆదిత్య మాట్లాడే హిందీ యాసను చూసి అవహేళన చేయడం ప్రారంభించారు. ఆదిత్య దీనిని ప్రతిఘటించడంతో, ఆగ్రహించిన వారు ఆయన్ని బూతులు తిడుతూ తీవ్రంగా కొట్టారు.
దాడి వివరాలు: ఉదయ్ మొదట ఆదిత్యను చెంపపై కొట్టాడు, ఆ తర్వాత నిఖిల్‌తో కలిసి ముఖంపై, తలపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఆదిత్య తీవ్రంగా గాయపడి రక్తమోడుతూ స్పృహ తప్పి పడిపోయారు. జోయెల్ భోజనం తీసుకుని అక్కడికి చేరుకోవడంతో, అన్ష్‌తో కలిసి ఆదిత్యను రక్షించి ఆసుపత్రికి తరలించారు. సమయానికి వారు రాకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని బాధితుడు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆదిత్య ఆర్.బి.ఎస్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసుల చర్య: దాడి చేసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు.
