ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో గల ఒక ప్రముఖ కారు షోరూమ్‌లో పనిచేసే జనరల్ మేనేజర్‌పై, అక్కడే పనిచేసే ఒక మహిళా ఉద్యోగి సిరా (మై) పోసి, అందరూ చూస్తుండగానే చితకబాదిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏం జరిగింది?
మారుతి సుజుకి షోరూమ్‌లో అంకిత్ ఆనంద్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అదే షోరూమ్‌లో పనిచేసే అమృతా సింగ్ అనే ఉద్యోగిని, మేనేజర్ అంకిత్ ఆనంద్ గత కొంతకాలంగా అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. అతని వేధింపులు భరించలేక విసిగిపోయిన అమృత, కార్యాలయంలోకి ప్రవేశించి అందరూ చూస్తుండగానే అంకిత్ ఆనంద్ ముఖంపై సిరా పోసింది. అక్కడే ఉన్న పోలీసుల సమక్షంలోనే అతడిని తీవ్రంగా కొట్టింది.
పోలీసుల విచారణ:
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై పోలీసు అధికారి సత్యప్రకాష్ తివారీ మాట్లాడుతూ, “అమృతా సింగ్‌తో పాటు మరో 3 నుండి 4 మంది మహిళా ఉద్యోగులు కూడా సదరు మేనేజర్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదులు చేశారు. గత కొంతకాలంగా అతను మహిళా ఉద్యోగులను వేధిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.
