17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి జైలుకు వెళ్లిన వ్యక్తి, బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ అదే బాలికపై తన స్నేహితుడితో కలిసి సామూహిక అత్యాచారం చేసిన ఘటన కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించింది.
ఏం జరిగింది? కర్ణాటకలోని గడగ్ జిల్లా, లక్ష్మేశ్వర్ తాలూకాకు చెందిన 17 ఏళ్ల బాలిక పాఠశాలలో చదువుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల ‘అల్లాబక్షి’ అనే వ్యక్తి ఆమెపై కన్నేశాడు. గత ఏడాది ఆమెను అపహరించి, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలు తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో, వారు లక్ష్మేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ‘పోక్సో’ (POCSO) చట్టం కింద అల్లాబక్షిని అరెస్టు చేసి జైలుకు పంపారు.
బెయిల్‌పై వచ్చి మళ్లీ దారుణం: గత నెలలో బెయిల్‌పై విడుదలైన అల్లాబక్షి, తనపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు బాలికపై పగ పెంచుకున్నాడు. ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. జూన్ 23న బాలిక కంప్యూటర్ క్లాసులకు వెళ్తుండగా, అల్లాబక్షి తన స్నేహితుడు ‘ఆసిఫ్’తో కలిసి ఆమెను మళ్లీ కిడ్నాప్ చేశాడు.
అడవిలో ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్లి, తన స్నేహితుడితో కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎలాగోలా వారి చెర నుండి తప్పించుకున్న బాలిక, తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి జరిగిన ఘోరాన్ని చెప్పి కన్నీరుమున్నీరైంది. బాధిత కుటుంబం వెంటనే లక్ష్మేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పరారీలో ఉన్న అల్లాబక్షి మరియు ఆసిఫ్‌లను పోలీసులు వేగంగా అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
