ముంబై: బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన జంటల్లో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ ఒకరు. వీరిద్దరి ప్రేమకథ ఎంతో మందికి ఇష్టం. షారుఖ్ తన తెలివైన సమాధానాలకు, రొమాంటిక్ స్వభావానికి పెట్టింది పేరు. అయితే, వీరిద్దరి వివాహం జరిగినప్పుడు జరిగిన ఒక సరదా సంఘటన ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.
నిజానికి షారుఖ్, గౌరీల ప్రేమకథ ఎంతో ఫిల్మీగా ఉంటుంది. 1984లో ఢిల్లీలో వీరిద్దరూ మొదటిసారి కలిశారు. అప్పుడు షారుఖ్ వయసు 19 ఏళ్లు, గౌరీ వయసు 14 ఏళ్లు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత, 1991 అక్టోబర్ 25న కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరి వివాహం హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగింది.
రిసెప్షన్ రోజున ఏం జరిగింది? ఫరీదా జలాల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ తన వివాహ రిసెప్షన్ రోజు జరిగిన ఒక సరదా సంఘటనను పంచుకున్నారు. ఆ రోజు రిసెప్షన్‌కు హాజరైన గౌరీ కుటుంబ సభ్యులు పాతకాలపు పద్ధతులకు చెందినవారు. అందరూ కలిసి “ఈ ముస్లిం అబ్బాయి ఆమె పేరు మారుస్తాడా? ఆమెను ముస్లిం మతం స్వీకరించేలా చేస్తాడా?” అని గుసగుసలాడుకోవడం షారుఖ్ విన్నారు.
సరదాగా ఆడిన ప్రాంక్: ఆ మాటలు విన్న షారుఖ్, వారిని సరదాగా ఆటపట్టించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే గౌరీ దగ్గరకు వెళ్లి, చాలా సీరియస్‌గా ఇలా అన్నారు: “గౌరీ, లే! బుర్కా వేసుకో, నమాజ్ చేద్దాం పద. ఇకపై ఆమె బుర్కాలోనే ఉంటుంది, ఇంటి నుండి బయటకు రాకూడదు, ఆమె పేరు ఆయిషాగా మారుస్తాం” అని అందరి ముందు అప్పట్లో సరదాగా జోక్ చేశారు. ఇది విన్న గౌరీ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత అది కేవలం తను ఆడిన సరదా జోక్ అని షారుఖ్ చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు.
సినిమాటిక్ ప్రేమకథ: వీరిద్దరి ప్రేమకథ నిజంగానే సినిమాటిక్. గౌరీ ముంబై వెళ్ళిపోయినప్పుడు, ఆమెను వెతుక్కుంటూ వెళ్ళడానికి షారుఖ్ తన దగ్గరున్న కెమెరాను కూడా అమ్మేసుకున్నారట. కెరీర్ ప్రారంభంలో స్ట్రగుల్ అవుతున్నప్పుడు గౌరీ ఆయనకు ఎంతో అండగా నిలిచారు.
ఇక షారుఖ్ కెరీర్ విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం ‘కింగ్’ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు దీపికా పదుకొణె నటిస్తున్నారు. 2023 తర్వాత దాదాపు మూడేళ్లకు వస్తున్న ఆయన సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
