మేరఠ్: ప్రేమకు వయసుతో సంబంధం లేదని కొందరు అంటుంటారు. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్ జిల్లాలో ఒక వృద్ధుడు నడిరోడ్డుపై మైనర్ బాలికను ప్రపోజ్ చేసి, అందరూ చూస్తుండగానే దేహశుద్ధిని ఆహ్వానించాడు. “నేను నిన్ను మూడేళ్లుగా ప్రేమిస్తున్నాను, నాతో పాటు సినిమాకు వస్తావా?” అని ఆ వృద్ధుడు అడగడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.
అసలేం జరిగింది? ఈ ఘటన మేరఠ్ జిల్లాలోని భావన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అబ్దుల్లాపూర్ ప్రాంతంలో జరిగింది. ఒక ఈ-రిక్షా డ్రైవర్ బాలికను రిక్షాలో తీసుకువెళ్తున్నప్పుడు, ఆమెపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తనకు ఆ బాలిక గత మూడేళ్లుగా ఇష్టమని చెబుతూ, సినిమాకు వెళ్దామని వేధించాడు. బాధితురాలు గట్టిగా నిరసన తెలపడంతో, అక్కడ గుమిగూడిన స్థానికులు, బాలిక కుటుంబ సభ్యులు ఆ రిక్షా డ్రైవర్‌ను పట్టుకుని నడిరోడ్డుపైనే చితకబాదారు.
పోలీసుల చర్య: ఈ ఘటనతో అక్కడ రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొనగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాలిక మరియు రిక్షా డ్రైవర్ ఇద్దరూ అబ్దుల్లాపూర్‌కు చెందినవారని పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భావన్‌పూర్ పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడైన ఈ-రిక్షా డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
