బీజింగ్: చైనా సరిహద్దులో ఉన్న ఒక వ్యవసాయ క్షేత్రం (ఫామ్) ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చైనాకు చెందిన ‘జువో జియావోంగ్’ అనే ఫామ్ యజమాని మంగోలియా సరిహద్దులో ఉన్న తన భారీ గడ్డి మైదానాల్లో పనిచేయడానికి సిబ్బంది కావాలని ఇచ్చిన ఒక సాధారణ ప్రకటన, చైనాలో పెద్ద చర్చకు దారితీసింది.
అసలేం జరిగింది? జువో జియావోంగ్ సుమారు 4,942 ఎకరాల (2,000 హెక్టార్లు) విస్తీర్ణంలో ఉన్న భారీ ఫామ్‌ను నిర్వహిస్తున్నారు. అందులో దాదాపు 3,000 గొర్రెలు ఉన్నాయి. ఈ గొర్రెలను చూసుకోవడానికి, ఏప్రిల్ చివరిలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వేసవిలో గొర్రెలను బయటకు మేతకు తీసుకెళ్లడానికి మరియు శీతాకాలంలో వాటిని సురక్షితంగా ఉంచడానికి ఇద్దరు వ్యక్తులు (దంపతులకు ప్రాధాన్యత) కావాలని అందులో పేర్కొన్నారు.
భయంకరమైన వాతావరణం: మంగోలియా సరిహద్దు కావడంతో, శీతాకాలంలో అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 30 డిగ్రీల కంటే తగ్గిపోతాయి. మొత్తం ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఫామ్‌లోనే ఉంటూ గొర్రెలకు మేత వేయడం, కొట్టాలను శుభ్రం చేయడం వంటి కఠినమైన పనులు చేయాల్సి ఉంటుంది. అందుకే యజమాని దంపతుల కోసం వెతికారు.
ఆకర్షణీయమైన జీతం: ఈ ఉద్యోగానికి ఇంతలా స్పందన రావడానికి కారణం, యజమాని ప్రకటించిన జీతం. ఎంపికైన వారికి నెలకు 8,000 యువాన్లు (భారతీయ కరెన్సీలో నెలకు రూ. 1 లక్షకు పైగా) జీతంగా ఇస్తామని చెప్పారు. ఇది చైనాలోని ప్రైవేట్ సంస్థల్లో సగటు జీతం (6,000 యువాన్లు) కంటే చాలా ఎక్కువ. అంతేకాకుండా, ఫామ్‌లోనే ఉచిత వసతి, నిత్యావసరాలు కూడా యజమానే భరిస్తానని చెప్పడంతో, సంపాదించిన డబ్బు మొత్తం ఆదా చేసుకోవచ్చని యువత దీనికి ఆకర్షితులయ్యారు.
చైనాలో ఆర్థిక సంక్షోభం: ఈ ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు రావడానికి చైనాలో నెలకొన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే కారణం. చైనాలో నిరుద్యోగిత రేటు 5 శాతం దాటడం, ప్రైవేట్ రంగంలో ఆదాయం పడిపోవడం వంటివి యువతను ఇబ్బంది పెడుతున్నాయి. రోజుకు 13 గంటలకు పైగా కష్టపడాల్సి వచ్చే కార్పొరేట్ ఉద్యోగాల (996 కల్చర్) పట్ల విసిగిపోయిన అనేకమంది పట్టభద్రులు, ప్రశాంతమైన ఈ పనిని కోరుకుంటున్నారు.
700 దరఖాస్తులు: ఈ ఉద్యోగం కోసం సుమారు 700 మంది దరఖాస్తు చేసుకున్నారని యజమాని జువో జియావోంగ్ ఆశ్చర్యంగా తెలిపారు. దరఖాస్తుదారుల్లో 10 శాతం మంది ఇటీవల యూనివర్సిటీలు పూర్తి చేసిన పట్టభద్రులే ఉండటం గమనార్హం. ఏఐ (AI) సాంకేతికత పెరగడం, ఏటా లక్షల మంది పట్టభద్రులు మార్కెట్లోకి రావడం వల్ల పట్టణాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి.
చివరకు, గొర్రెల పెంపకంలో మంచి అనుభవం ఉన్న ఒక దంపతులను జువో జియావోంగ్ ఉద్యోగంలోకి తీసుకున్నారు.
