కేరళ: కేరళలోని నెడుమంగాడ్ ప్రాంతంలో జరిగిన ఒక దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అష్కర్ అనే వ్యక్తి తన ఒకటిన్నర ఏళ్ల చిన్నారి ‘అర్షద్’ను విచక్షణారహితంగా కొట్టి చంపేశాడు. పోలీసులు అదుపులోకి తీసుకున్న అష్కర్‌ను విచారించగా, బిడ్డకు అన్నం తినిపిస్తుండగా వాడు ఏడుస్తూ ఉండటంతో, ఆగ్రహం పట్టలేక కొట్టినట్లు నిందితుడు అంగీకరించాడు.
మొదటి భార్యను కోమాలోకి పంపి.. ఈ ఘటన తర్వాత, నిందితుడు అష్కర్ మొదటి భార్య అమీనా కుటుంబ సభ్యులు అతనిపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొద్ది నెలలకే, అమీనాను అష్కర్, అతని తల్లి మరియు సోదరి కలిసి కట్నం కోసం దారుణంగా హింసించారని అమీనా తల్లి షాజిలా బీవీ ఒక ప్రైవేట్ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అష్కర్ తన కూతురు అమీనా తలని గోడకేసి బలంగా కొట్టడంతో ఆమె పుర్రె పగిలిపోయిందని, గత ఏడాది కాలంగా ఆమె కోమాలో ఉందని, ఇటీవలె స్పృహలోకి వచ్చి ప్రస్తుతం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని షాజిలా ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం.. ఈ హింసపై ఆరుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె మండిపడ్డారు. పోలీసుల ఈ నిర్లక్ష్యమే అష్కర్‌ను మరో పసిబిడ్డను బలి తీసుకునేంత ధైర్యాన్ని ఇచ్చిందని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా, అమీనా చిన్న కొడుకు నదిలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనలో కూడా అష్కర్ హస్తం ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే, అఖిల అనే మహిళతో అష్కర్ కాపురం పెట్టాడని బాధితురాలి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనపై కేరళ పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
