ఎడారిలో దాగి ఉన్న చైనా డ్రాగన్.. కంగారు పడుతున్న అమెరికా.. కేవలం 90 సెకన్లలోనే ప్రతిదాడి!

బీజింగ్: తైవాన్ విషయంలో అమెరికా మరియు చైనాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, చైనాలోని ఒక మారుమూల ఎడారి ప్రాంతంలో చైనా సైన్యం నిర్మిస్తున్న భారీ అణు ఆయుధ స్థావరానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు బయటకు వచ్చి ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి.

తైవాన్ తమదేనని చైనా వాదిస్తుంటే, తాము స్వతంత్ర దేశమని తైవాన్ అంటోంది. దీనికి మద్దతుగా అమెరికా నిలవడంతో పరిస్థితి వేడెక్కింది. ఇలాంటి సమయంలో ఈ శాటిలైట్ చిత్రాలు సంచలనం రేపాయి.

భారీ ఆయుధ నిల్వ కేంద్రం: చైనా తన ఎడారి ప్రాంతంలో అతిపెద్ద అణు ఆయుధ నిల్వ కేంద్రాలను నిర్మిస్తోందని సమాచారం. అమెరికా ఒకవేళ చైనాపై అకస్మాత్తుగా అణు దాడి చేసినా, ఆ దాడులను తట్టుకుని వెంటనే తిరిగి దాడి చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే ఈ భారీ నిర్మాణాల ఉద్దేశమని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాయిటర్స్ విశ్లేషించిన శాటిలైట్ డేటా ప్రకారం, వాయువ్య జింజియాంగ్ ప్రాంతంలోని ‘హామి’ అనే చోట గత ఆరేళ్లలో రెండు భారీ సైనిక నిర్మాణాలు జరిగాయి. ఎడారిలో వీటి చుట్టూ 80కి పైగా క్షిపణి లాంచింగ్ ప్యాడ్‌లను ఏర్పాటు చేశారు. గత ఏప్రిల్, మే నెలల్లో ఈ ప్రాంతంలో భారీ సైనిక వాహనాలు, క్షిపణులతో చైనా విన్యాసాలు చేసినట్లు చిత్రాల్లో స్పష్టమవుతోంది.

సి3 (C3) కమాండ్ సెంటర్: ఇక్కడ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, భారీ శాటిలైట్ డిష్‌లు మరియు రెండు మెగా టవర్లను నిర్మిస్తున్నారు. ఇవి చైనా అణు ఆయుధ కార్యకలాపాలను పర్యవేక్షించే అత్యంత శక్తివంతమైన ‘C3’ (Command, Control, and Communications) కేంద్రంగా పనిచేయవచ్చని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సీనియర్ ఫెలో టోంగ్ జావో అంచనా వేస్తున్నారు.

జి జిన్‌పింగ్ లక్ష్యం: అణు ఆయుధాల విషయంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. దీనికింద చైనా తన అణు ఆయుధ సామర్థ్యాన్ని వేగంగా ఆధునీకరిస్తోంది. చైనా ఇప్పటికే తన మూడు ప్రధాన సైలో (Silo) స్థావరాల్లో 100 ఖండాంతర క్షిపణులను మోహరించింది. 2030 నాటికి 1,000 అణు వార్‌హెడ్లను రంగంలోకి దించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అప్రమత్తమైన రక్షణ వ్యవస్థ: అమెరికా లేదా రష్యా దేశాలు తమ దగ్గర ఉన్న భారీ అణు ఆయుధాలపై ఆధారపడతాయి. కానీ చైనా వ్యూహం భిన్నంగా ఉంది. చైనాకు చెందిన ‘హువోయాన్-1’ శాటిలైట్లు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను కలిగి ఉన్నాయి. శత్రు దేశం క్షిపణిని ప్రయోగించిన 90 సెకన్లలోనే దాన్ని గుర్తించి, తదుపరి 3 నుండి 4 నిమిషాల్లో చైనా కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ పంపుతాయి. శత్రు క్షిపణి వచ్చి పడకముందే చైనా తన సైలోల నుండి ప్రతిదాడిని (Counter-attack) ప్రారంభించేలా అత్యంత పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.


Posted

in

by

Tags: