అమెరికా, ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల గత కొన్ని నెలలుగా భారత్ అంతటా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ మరియు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ ద్రవ్యోల్బణ పరిస్థితుల నడుమ, దేశంలోని వివిధ నగరాల్లో స్థానిక సేవల ఛార్జీలు ఎంత భిన్నంగా ఉన్నాయనే దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త సాజిత్ పై, తాను ఇటీవల నోయిడా నుండి బెంగళూరులోని ఇందిరా నగర్‌కు మారిన తర్వాత అక్కడి ఇస్త్రీ (Ironing) ధరలను చూసి షాక్ అయ్యానని ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్ట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది.
తాను నోయిడాలో ఉన్నప్పుడు ఒక బట్టకు కేవలం 5 రూపాయలు మాత్రమే వసూలు చేసేవారని, బెంగళూరులో ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయని ఊహించినా.. ఇక్కడ ఒక బట్టకు కనీసం 12 నుండి 20 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో అత్యంత ఖరీదైన నగరంగా పేరున్న ముంబై నుండి వచ్చిన వారు కూడా, బెంగళూరులో ఇస్త్రీ ధరలు ఇంత ఎక్కువగా ఉండటం చూసి ఆశ్చర్యపోతున్నారని ఆయన తన పోస్ట్‌లో తెలిపారు.
బెంగళూరులో ధరలు ఎక్కువగా ఉండటానికి గల ఒక ముఖ్యమైన కారణాన్ని కూడా సాజిత్ పై వివరించారు. ఢిల్లీ, నోయిడా వంటి ఉత్తర భారత నగరాల్లో సంప్రదాయబద్ధంగా బొగ్గును ఉపయోగించి ఇస్త్రీ పెట్టెలను వేడి చేస్తారు. కానీ బెంగళూరులో ఎక్కువ మంది ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్లతో పనిచేసే ఆధునిక ఐరన్ బాక్సులను ఉపయోగిస్తున్నారు. ఉత్తర భారతంలో తందూరీ రెస్టారెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ బొగ్గు ధర తక్కువగా ఉండొచ్చని ఆయన తన సందేహాన్ని వ్యక్తం చేశారు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో, వివిధ నగరాల నుండి నెటిజన్లు తమ ప్రాంతాల్లోని ధరలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. సూరత్‌లో సాధారణ ఇస్త్రీకి 10 రూపాయలు, స్టీమ్ ఇస్త్రీకి 25 రూపాయలు తీసుకుంటారని, వారానికి మూడు రోజులు ఇంటికి వచ్చి బట్టలు తీసుకెళ్లి మళ్ళీ ఇచ్చే సదుపాయం ఉచితంగా ఉంటుందని ఒకరు తెలిపారు. థానేకు చెందిన మరొకరు తమ ప్రాంతంలో సాధారణ ఇస్త్రీకి 7 రూపాయలు, స్టీమ్ ఇస్త్రీకి 20 రూపాయలు తీసుకుంటున్నారని, ముంబై కంటే బెంగళూరులో ధరలు ఎక్కువగా ఉండటం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు.
అయితే, ఈ చర్చలో చాలా మంది నెటిజన్లు ఇస్త్రీ చేసే కార్మికులకు మద్దతుగా నిలుస్తున్నారు. రోజంతా నిలబడి, కాయకష్టం చేసే ఈ వృత్తి చాలా కష్టమని, వారు ఎదుర్కొనే శారీరక సమస్యలను పరిగణనలోకి తీసుకుంటే 15 నుండి 20 రూపాయలు ఏమాత్రం ఎక్కువ కాదని వాదిస్తున్నారు. కారు క్లీనింగ్, ఇంటి పనులు, వంట వంటి శారీరక శ్రమతో కూడిన సేవల ధరలు ఉత్తర భారతదేశంలో ఎప్పుడూ దక్షిణ భారత మెట్రో నగరాల కంటే తక్కువగానే ఉంటాయని మరొకరు అభిప్రాయపడ్డారు.
