అమెరికాలోని లాస్ వేగాస్‌లో ఒక హోటల్లో బస చేసిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. రాత్రి నిద్రిస్తుండగా అతడి ప్రైవేట్ పార్ట్‌పై తేలు కుట్టింది. ఈ ఘటన తర్వాత ఆ వ్యక్తికి శృంగారంలో పాల్గొనడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై బాధితుడు హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశాడు.
కాలిఫోర్నియాకు చెందిన 62 ఏళ్ల మైఖేల్ ఫార్చీ అనే వ్యక్తి గత ఏడాది క్రిస్మస్ తర్వాత ‘ది వెనీషియన్’ హోటల్లో బస చేశాడు. అకస్మాత్తుగా అతడికి ప్రైవేట్ పార్ట్ వద్ద తీవ్రమైన నొప్పి కలగడంతో, చెక్ చేసుకోగా బెడ్‌పై తేలు ఉన్నట్లు గుర్తించాడు. అది తన వృషణాలపై కుట్టినట్లు తెలుసుకున్నాడు. ఎవరో కత్తితో కోస్తున్నంత తీవ్రమైన నొప్పి అని మైఖేల్ పేర్కొన్నాడు.
సాక్ష్యం మరియు కేసు: తనను కుట్టిన తేలు ఫోటోను మైఖేల్ సాక్ష్యంగా దాచుకున్నాడు. ఈ ఘటన వల్ల తాను మానసికంగా కృంగిపోయానని, పీటీఎస్డీ (Post-traumatic stress disorder – మానసిక వేదన) ఎదుర్కొంటున్నానని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నాడు. అంతేకాకుండా, ఈ ఘటన తర్వాత తన లైంగిక జీవితంలో భారీ మార్పులు వచ్చాయని, భార్యతో సంబంధం కొనసాగించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ విషయాన్ని అతని భార్య కూడా ధృవీకరించినట్లు లాయర్లు తెలిపారు.
హోటల్ నిర్లక్ష్యం: ఈ ఘటనపై హోటల్ సిబ్బందికి సమాచారం ఇస్తే, వారు దాన్ని సీరియస్‌గా తీసుకోకుండా ఎగతాళి చేస్తూ నవ్వారని మైఖేల్ ఆరోపించాడు. దీనిపై కోర్టులో మైఖేల్ పరిహారం కోసం కేసు వేశాడు. హోటల్ యాజమాన్యం ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, మైఖేల్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పుడు మైఖేల్‌కు పరిహారం అందుతుందా లేదా అన్నది కోర్టు విచారణలో తేలాల్సి ఉంది.
