అయర్లాండ్‌లో నడుము నొప్పితో బాధపడుతున్న 33 ఏళ్ల యువకుడు, దానికి పరిష్కారంగా గత 18 నెలలుగా తన సొంత వీర్యాన్ని (Sperm) సూది ద్వారా తన చేతిలోకి ఇంజెక్ట్ చేసుకున్న వింత ఘటన ప్రపంచ వైద్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
‘ఐరిష్ మెడికల్ జర్నల్’ అనే వైద్య పత్రికలో ఈ విచిత్రమైన కేసును అధికారికంగా నమోదు చేశారు. నడుము నొప్పిని తగ్గించుకోవడానికి వీర్యాన్ని శరీరంలోకి ఎక్కించుకున్న మొదటి కేసు ఇదేనని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యక్తి నడుము నొప్పి గురించి చికిత్స కోసం రాలేదు, కానీ వీర్యాన్ని ఇంజెక్ట్ చేసుకున్న చేతిలో తీవ్రమైన నొప్పి, వాపు మరియు గడ్డ కట్టడంతో అత్యవసర విభాగంలో చేరాడు. వైద్యులు పరీక్షించగా, అతని చర్మం కింద గాలి చేరడం (Subcutaneous emphysema), కండరాలు మరియు రక్తనాళాల్లో చీము పట్టి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. ఆన్‌లైన్‌లో సిరంజిని కొనుగోలు చేసి, తన వీర్యాన్ని మూడు డోసుల చొప్పున కండరాల్లోకి మరియు నరాల్లోకి ఎక్కించుకున్నట్లు రోగి అంగీకరించాడు.
శరీరంలోకి వెళ్ళే వీర్యాన్ని మన రోగనిరోధక వ్యవస్థ ఒక ‘అపరిచిత పదార్థం’గా పరిగణించి దాడి చేయడం వల్ల, ఇలాంటి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తుతాయి. సదరు వ్యక్తికి తీవ్రమైన యాంటీబయాటిక్ చికిత్స అందించినప్పటికీ, నడుము నొప్పి తగ్గగానే వైద్యుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అతను ఆసుపత్రి నుండి సగం చికిత్సలోనే పారిపోయాడు. ఇంటర్నెట్‌లో కనిపించే ఇటువంటి నకిలీ ‘ప్రత్యామ్నాయ వైద్య’ పద్ధతులను నమ్మి, ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని వైద్యులు ప్రజలను గట్టిగా హెచ్చరిస్తున్నారు.
