గుర్తుపట్టారా? ఒకప్పుడు ఐపీఎల్‌లో కోట్ల విలువ, నేడు బ్యాంక్ ఉద్యోగం.. విరాట్ కోహ్లీకి అత్యంత ఇష్టుడైన ఈ క్రికెటర్ ఎవరో తెలుసా?

న్యూఢిల్లీ: క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆటగాళ్లు సాధారణంగా కోచింగ్ లేదా కామెంట్రీ వైపు మొగ్గు చూపుతుంటారు. ప్రస్తుత రోజుల్లో రిటైర్డ్ ఆటగాళ్ల కోసం ప్రత్యేక లీగ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే, కొందరు మాత్రం రిటైర్మెంట్ తర్వాత పూర్తిగా భిన్నమైన వృత్తిని ఎంచుకుంటారు. అలా ఒక భారతీయ క్రికెటర్ ప్రస్తుతం బ్యాంక్‌లో సాధారణ ఉద్యోగం చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

ఆ ఆటగాడు మరెవరో కాదు, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన సిద్ధార్థ్ కౌల్. సిద్ధార్థ్ కౌల్ క్రికెట్ కెరీర్ పెద్దగా సుదీర్ఘంగా సాగకపోయినా, ఆడినంత కాలం తన బౌలింగ్‌తో బాగానే ఆకట్టుకున్నాడు. అండర్-19 ప్రపంచ కప్ మాత్రమే కాకుండా, భారత జాతీయ జట్టు తరపున కూడా సిద్ధార్థ్ ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరపున 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడిన సిద్ధార్థ్, సరైన అవకాశాలు లేకపోవడంతో 2024లో రిటైర్మెంట్ ప్రకటించాడు.

చండీగఢ్ ఎస్‌బిఐ బ్రాంచ్‌లో సిద్ధార్థ్ ఉద్యోగం: దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ జట్టు తరపున అద్భుతంగా రాణించిన సిద్ధార్థ్, రిటైర్మెంట్ తర్వాత చండీగఢ్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్‌లో పనిచేస్తున్నారు. చాలా మంది మాజీ క్రికెటర్లు కోచింగ్ లేదా మీడియా రంగం వైపు వెళ్తుంటే, సిద్ధార్థ్ బ్యాంకింగ్ రంగాన్ని ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఐపీఎల్‌లో కోట్ల విలువ: భారత జట్టులో సిద్ధార్థ్ కౌల్‌కు ఎక్కువ అవకాశాలు రాకపోయినా, ఐపీఎల్‌లో మాత్రం తనదైన ముద్ర వేశాడు. 2008లో కోల్‌కతా నైట్ రైడర్స్ ద్వారా 20 లక్షలకు ఐపీఎల్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత 2013లో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని 50 లక్షలకు కొనుగోలు చేసింది. 2018 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిపై ఏకంగా 3.80 కోట్ల భారీ ధర పలికింది. ఆ తర్వాత 2022, 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అతడిని 75 లక్షలకు కొనుగోలు చేసింది. తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 55 మ్యాచ్‌లు ఆడిన సిద్ధార్థ్, 58 వికెట్లు పడగొట్టాడు. 29 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం అతని కెరీర్ బెస్ట్ గణాంకం.


Posted

in

by

Tags: