ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోని పావువాలా ప్రాంతంలో, ఒక నవ వధువును ఆమె భర్త మరియు అత్తమామల కుటుంబం నిర్బంధించి చేసిన చిత్రహింసలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి.
బాధితురాలి తండ్రి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, గత ఏడాది జూలై 2025 నుండి మే 2026 వరకు సుమారు 10 నెలల పాటు ఆ యువతిని ఒక గదిలో, బాత్రూమ్లో మృగీయంలా బంధించి ఉంచారు. ఈ కాలంలో ఆమెకు కనీసం తినడానికి ఆహారం కూడా సరిగ్గా పెట్టకుండా, కేవలం పచ్చి బియ్యం, ఉల్లిపాయలు, మిరపకాయలు మాత్రమే ఇచ్చారు. దీనివల్ల ఆమె మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింది.
అంతేకాకుండా, కుర్చీలు, వైపర్లు మరియు కర్రలతో ఆమె జుట్టు పట్టుకుని క్రూరంగా కొట్టడమే కాకుండా, ఆమె ప్రైవేట్ పార్ట్స్‌పై బాటిళ్లు మరియు కర్రలతో దాడి చేస్తూ అరాచకానికి పరాకాష్టకు చేరుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం వివాహమైన ఈమెకు, గత ఏడాది ఫిబ్రవరిలో కవల పిల్లలు జన్మించారు. అయితే, ఆ యువతిని, పిల్లలను వారి తల్లిదండ్రులను కలవనీయకుండా భర్త రాహుల్ కందురి మరియు అతని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.
తల్లిదండ్రులు ఫోన్ చేసిన ప్రతిసారీ, కూతురు స్నానం చేస్తోందని లేదా నిద్రపోతోందని అబద్ధాలు చెప్పి మోసం చేశారు. వారు స్వయంగా వెళ్లినప్పుడు ప్రాణహాని కలిగిస్తామని బెదిరించారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు కేసు నమోదు చేసి తీవ్ర విచారణ జరుపుతున్నారు.
