తిరువనంతపురం: బెడ్రూమ్ కిటికీ పక్కనే గంజాయిసాగు.. లక్షల రూపాయల జీతం తీసుకునే ఐటీ మేనేజర్ పోలీసులకు చిక్కాడు.
హరియాణాకు చెందిన విశాల్ (26) అనే ఐటీ కంపెనీ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయిఆకులను పచ్చడి (చట్నీ) చేసుకోవడానికి మరియు పాలలో కలుపుకుని తాగడానికి మాత్రమే తాము ఈ మొక్కలను పెంచుతున్నానని, ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా సహజసిద్ధమైన ఎరువులతోనే వీటిని పెంచానని నిందితుడు పోలీసులకు తెలిపాడు. తిరువనంతపురంలోని శ్రీకార్యంలోని తన ఫ్లాట్‌లో అత్యాధునిక పద్ధతిలో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించి శ్రీకార్యం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడు టెక్నోపార్క్‌లోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో నెలకు సుమారు రూ. 1.5 లక్షల జీతంతో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
పోలీసులు ఫ్లాట్‌లో జరిపిన తనిఖీల్లో సుమారు 30 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగిన 70కి పైగా గంజాయిమొక్కలను స్వాధీనం చేసుకున్నారు. పగలు ఐటీ మేనేజర్‌గా పని చేసే విశాల్, రాత్రి వేళల్లో ఈ గంజాయి తోటను చూసుకునేవాడు. మార్కెట్లో కొన్న ప్రత్యేకమైన కుండీల్లో, గుడ్ల ట్రేలలో మరియు చిన్న చిన్న పాత్రల్లో ఇతడు ఈ మొక్కలను పెంచాడు. ‘ఆపరేషన్ తూఫాన్’లో భాగంగా లభించిన సమాచారంతో పోలీసులు ఈ ఫ్లాట్‌పై దాడి చేశారు.
గంజాయిను అమ్మి డబ్బు సంపాదించాలనే ఉద్దేశం ఇతడికి లేదని, పూర్తిగా తన సొంత అవసరాల కోసమే ఈ సాగు చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. అధిక జీతం తీసుకునే ఐటీ ప్రొఫెషనల్ ఇంత వినూత్నంగా ఇంట్లోనే గంజాయి సాగు చేయడం పోలీసులను, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిందితుడిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని శ్రీకార్యం పోలీసులు తెలిపారు. అనంతరం ఇతడిని కోర్టులో హాజరుపరిచారు.
