వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరంలో రాజ్‌ఘాట్ వద్ద ఉన్న భదోహు చుంగీ మసీదును అధికారులు కూల్చివేశారు. ఈ మసీదు రైల్వే భూమిలో అక్రమంగా నిర్మించబడిందని, అందుకే ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
పరిపాలనా యంత్రాంగం అర్ధరాత్రి వేళ భారీగా బుల్డోజర్లతో అక్కడికి చేరుకుని మసీదును పూర్తిగా కూల్చివేశారు. కాశీ రైల్వే స్టేషన్ విస్తరణ పనుల్లో భాగంగానే ఈ మసీదును తొలగించినట్లు సమాచారం. రైల్వే భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడంలో భాగంగా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
రైల్వే నోటీసులు ఇచ్చినా స్పందించని ముతవల్లి: ఈ కూల్చివేత సమయంలో వారణాసిలోని పలు పోలీస్ స్టేషన్ల బలగాలతో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) భారీగా మోహరించింది. వారణాసిలోని ఆదంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ రైల్వే భూమిలో అక్రమంగా మసీదును నిర్మించారు. కాశీ స్టేషన్ విస్తరణలో భాగంగా రైల్వే ఈ భూమిని ఖాళీ చేయించే ప్రక్రియను ప్రారంభించింది. రైల్వే అధికారులు సుమారు ఒకటిన్నర నెల క్రితమే మసీదు నిర్వాహకులకు (ముతవల్లి) నోటీసులు ఇచ్చారు. కానీ వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో, రైల్వే యంత్రాంగం ఈరోజు ఈ కూల్చివేత చర్య చేపట్టింది.
సర్వేలో బయటపడిన అక్రమ నిర్మాణం: భూమిని సర్వే (పాయిమాష్) చేసినప్పుడు, ఈ ప్రాంతంలో అక్రమంగా మసీదు నిర్మించినట్లు గుర్తించారు. అప్పటి నుంచి రైల్వే అధికారులు పదేపదే నోటీసులు ఇస్తూ వచ్చారు. మసీదుతో పాటు ఆ భూమిలో ఉన్న ఇతర అక్రమ నిర్మాణాలను కూడా తొలగించి, స్థలాన్ని చదును చేశారు. ఈ ప్రక్రియలో ఆరుకు పైగా బుల్డోజర్లను ఉపయోగించారు. ఈ కూల్చివేతతో కాశీ స్టేషన్ విస్తరణ పనులు వేగవంతం కానున్నాయి. 2024లో ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు ద్వారా కాశీ స్టేషన్‌ను అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచస్థాయి స్టేషన్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.
