వేసవి కాలం వచ్చిందంటే చాలు, మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే. సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వింత వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ‘ఎక్స్’ (X) ప్లాట్ఫామ్లో ఒక వీడియో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. గోవింద్ ప్రతాప్ సింగ్ అనే యూజర్ ఈ వీడియోను పంచుకున్నారు. రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి, దారిలో ఉన్న తోటలో గుత్తులు గుత్తులుగా ఉన్న మామిడి పండ్లను చూసి ఆశపడి చేసిన పని, దానికి ప్రతిఫలంగా అతనికి దక్కిన ‘బహుమతి’ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
రైలు ఒక చోట మెల్లగా వెళ్తున్నప్పుడు, పక్కనే ఉన్న తోటలో అందంగా వేలాడుతున్న మామిడి పండ్లను చూసిన ఆ వ్యక్తి, ఏమాత్రం ఆలోచించకుండా రైలులోంచి కిందకు దూకేశాడు. కొన్ని పండ్లను కోసుకొని ప్రయాణాన్ని రుచికరంగా మార్చుకోవాలని అతను భావించాడు. కానీ, అతను పండ్లను కోస్తుండగా తోట యజమాని దాన్ని గమనించి, కర్రతో అతడిని వెంటాడాడు. ప్రాణభయంతో ఆ వ్యక్తి కేకలు వేస్తూ పరుగెత్తుకుంటూ వచ్చి, కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించాడు.
అయితే, వదలని యజమాని రైలు తలుపు పట్టుకుని ఎక్కబోతున్న ఆ వ్యక్తికి కర్రతో ధర్మ దెబ్బలు ఇచ్చి సన్మానం చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, “అబ్బాయికి మామిడి పండ్లు దక్కలేదు సరే.. కానీ చింతపండు లాంటి దెబ్బలు మాత్రం అదిరిపోయాయి”, “షోరూమ్‌లో కూడా ఇంత మంచి సర్వీస్ ఇవ్వరు” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.
