ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ‘సహారా ఎడారి’లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మాలిలో మతపరమైన వేడుకలు ముగించుకుని తిరిగి వస్తున్న 49 మంది ప్రయాణికులు, ఎడారి మధ్యలో ట్రక్కు పాడైపోవడంతో దాహం, ఎండకు అల్లాడి ప్రాణాలు విడిచారు.
ఏం జరిగింది? నైగర్-అల్జీరియా సరిహద్దులోని ‘అసమాకా’కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ట్రక్కు అనుకోకుండా మార్గం తప్పి, నిర్మానుష్యమైన ఎడారి ప్రాంతంలో నిలిచిపోయింది. వాహనం చెడిపోయిన తర్వాత, అందులోని వారు పలు రోజులు దానిని బాగు చేయడానికి శాయశక్తులా ప్రయత్నించారు. అయితే, ఎడారిలోని భరించలేని వేడికి వారి వద్ద ఉన్న నీటి నిల్వలు త్వరగానే అయిపోయాయి. నీటి చుక్క కోసం వారు పడిన వేదన వర్ణనాతీతం.
బతికి బయటపడ్డ ఇద్దరు: మృత్యువు కళ్లముందు కనిపిస్తుండగా, ఇద్దరు వ్యక్తులు ప్రాణాలకు తెగించి దాదాపు 50 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి ఒక నీటి వనరును కనుగొన్నారు. అక్కడి నుండి వారు ‘అసమాకా’ చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకునే సరికి ఆలస్యమైంది. అప్పటికే 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎండ నుంచి తప్పించుకోవడానికి ట్రక్కు కిందకు చేరిన వారు, అక్కడే ప్రాణాలు వదిలారు. వారిని అక్కడే సామూహిక సమాధుల్లో ఖననం చేయాల్సి వచ్చింది.
మరో 60 మంది ప్రాణాలు కాపాడిన రెస్క్యూ టీమ్: అదే ప్రాంతంలో తిరుగు ప్రయాణంలో ఉండగా, రెస్క్యూ టీమ్‌కు మరో ట్రక్కు కనిపించింది. అందులో సుమారు 60 మందికి పైగా వలసదారులు ఉన్నారు. ట్రక్కు బ్యాటరీ పాడవడంతో వారు మూడు రోజులుగా ఎడారిలోనే చిక్కుకుపోయి ఉన్నారు. సరైన సమయంలో రెస్క్యూ టీమ్ అక్కడకు చేరుకోవడంతో, వారు తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు. వారికి నీరు అందించి, వాహనాన్ని బాగు చేసి సురక్షితంగా పంపించారు.
ఎందుకు వెళ్తారు? నైగర్‌లోని ఈ ఎడారి ప్రాంతం, ఐరోపా దేశాలకు వెళ్లాలని కలలు కనే వేలాది మంది వలసదారులకు ఒక ప్రధాన మార్గం. ఈ క్రమంలో ఎంతోమంది అమాయకులు ప్రతి ఏటా ఎడారిలో ఆకలి, దాహంతో ప్రాణాలు కోల్పోతున్నారు.
