అది అర్ధరాత్రి సమయం. ఒక యువకుడు ఎవరికీ కనిపించకుండా రహస్యంగా ఒక ఇంట్లోకి చొరబడ్డాడు. సరిగ్గా అదే సమయంలో లైట్లు వెలగడంతో ఇంట్లోని వారంతా మేల్కొన్నారు. ఆ యువకుడిని చూడగానే ‘దొంగ.. దొంగ’ అంటూ గట్టిగా కేకలు వేశారు. అంతే, ఆ తర్వాత అందరూ కలిసి అతనికి దేహశుద్ధి చేశారు. ఆ యువకుడు మాత్రం “ప్లీజ్, ఒక్కసారి నా మాట వినండి” అని ప్రాధేయపడ్డాడు. ఆ తర్వాత అతను తన గురించి చెప్పిన నిజం విని.. మరుసటి రోజు ఉదయమే ఆ కుటుంబం అతనిని తమ ఇంటి అల్లుడిని చేసుకుంది. ఇప్పుడు ఈ పెళ్లి గురించిన చర్చ అంతటా నడుస్తోంది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో చోటుచేసుకుంది.
నిజానికి, ఆ యువకుడు అర్ధరాత్రి చొరబడిన ఇల్లు అతని ప్రేయసిది. అతను అర్ధరాత్రి వేళ తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి అక్కడికి వెళ్లాడు. కానీ అతని దురదృష్టం కొద్దీ, గర్ల్‌ఫ్రెండ్ కుటుంబ సభ్యులు అతనిని దొంగ అనుకుని చితకబాదారు. ఆ తర్వాత ఆ యువకుడు అసలు నిజం చెప్పడంతో, మరుసటి రోజే ఆ కుటుంబ సభ్యులు తమ కుమార్తెతో అతనికి వివాహం జరిపించారు.
దొంగ అనుకుని చితకబాదారు
సమాచారం ప్రకారం.. ఈ వింత ఉదంతం జాసర్పతహా పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీంపూర్ ఖుర్ద్ గ్రామంలో జరిగింది. సోమవారం రాత్రి, ఖుటహన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పనౌలి గ్రామానికి చెందిన వికాస్ పాశ్వాన్ అనే యువకుడు.. తన ప్రేయసి రూబీని కలవడానికి రహస్యంగా ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. చీకటిలో వికాస్ ఇంట్లోకి చొరబడటం గమనించిన ఎవరో ఒకరు.. దొంగ అనుకుని గట్టిగా కేకలు వేశారు. దీంతో ఇంట్లోని వారు కూడా మేల్కొన్నారు. అందరూ కలిసి వికాస్‌ను పట్టుకుని విచక్షణా రహితంగా కొట్టారు.
ఊరంతా పెళ్లి గురించే చర్చ
అలా పట్టుబడిన తర్వాత ఆ యువకుడిని విచారించగా, అతని పేరు వికాస్ పాశ్వాన్‌గా తేలింది. తాను దొంగను కానని, తన ప్రేయసిని కలవడానికి వచ్చానని ఆ యువకుడు చెప్పాడు. తన ప్రేయసి పేరు రూబీ అని తెలిపాడు. నిజంగానే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందా లేదా అని కుటుంబ సభ్యులు రూబీని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నారు. దీనికి రూబీ అవునని సమాధానమిస్తూ, అతనితోనే కలిసి ఉంటానని చెప్పింది. దీంతో మరుసటి రోజు ఉదయమే కుటుంబ సభ్యులు ఇద్దరికీ పెళ్లి చేసేశారు. ప్రస్తుతం ఈ విచిత్ర వివాహం గురించి ఆ ప్రాంతమంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
