“పోలీసులు వచ్చేశారు.. గంజాయిని ఎక్కడ దాచాలిరా?” కంగారులో కుక్కర్‌లో వేసిన వ్యక్తి.. చివరికి ఊహించని ట్విస్ట్..!!

కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లా కున్నంకుళం సమీపంలోని అడుప్పుట్టి ప్రాంతంలో, పోలీసులు “ఆపరేషన్ తూఫాన్” (Operation Toofan) పేరుతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ఆ సమయంలో అక్కడ నివసిస్తున్న బినీష్ (40) అనే వ్యక్తి ఇంటి తలుపును పోలీసులు తట్టారు. గుమ్మం ముందు పోలీసులు నిలబడి ఉండటం చూసి బినీష్‌కు భయంతో కాళ్లు, చేతులు వణకడం మొదలయ్యాయి. ఇంట్లో దాచి ఉంచిన 400 గ్రాముల గంజాయిని ఎక్కడ దాచాలో తెలియక, తీవ్ర కంగారులో.. అప్పుడు స్టవ్ మీద అన్నం ఉడుకుతున్న ప్రెషర్ కుక్కర్ లోపల ఆ గంజాయి ప్యాకెట్‌ను వేసి మూత పెట్టేశాడు.

కానీ, కుక్కర్ “విజిల్” రావడం ప్రారంభమవగానే, అన్నం ఉడికే వాసనతో పాటు గంజాయి ఘాటైన వాసన కూడా ఇల్లంతా, ముఖ్యంగా వంటగది అంతటా వ్యాపించింది. ఆ వాసన ఆధారంగానే పోలీసులు నేరుగా వంటగదిలోకి వెళ్లి తనిఖీలు చేశారు. కుక్కర్ మూత తీసి చూడగా, ఉడుకుతున్న అన్నం మధ్యలో గంజాయి ప్యాకెట్ ఉడుకుతుండటం చూసి పోలీసులే షాక్‌కు గురయ్యారు.

ఆ తర్వాత, బినీష్‌ను పోలీసులు ఆధారాలతో సహా రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. గంజాయిని దాచబోయి అడ్డంగా బుక్కైన ఈ విచిత్రమైన ‘హాస్యాస్పద’ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


Posted

in

by

Tags: