కన్నతల్లి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా డబ్బులు లేక అల్లాడిపోయిన ఒక 7 ఏళ్ల అమాయక బాలుడి గుండె లవడే ఉదంతం ఉత్తర ప్రదేశ్‌లోని గోండా (Gonda) జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
ఆ బాలుడు తన తల్లితో కలిసి బస్టాండ్‌లో నిలబడి ఉన్న సమయంలో, ఆమె అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయింది. అక్కడున్న స్థానికుల సహాయంతో ఆమెను సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే, చికిత్స ఫలించకపోవడంతో ఆ తల్లి పాపం ప్రాణాలు కోల్పోయింది. తన తల్లి మృతదేహాన్ని తనకు అప్పగించాలని ఆ పసివాడు ఆసుపత్రి యాజమాన్యాన్ని వేడుకున్నాడు. కానీ, చికిత్సకు అయిన ఖర్చు మొత్తం చెల్లిస్తేనే శవాన్ని ఇస్తామని, లేదంటే లేదని వైద్యులు, యాజమాన్యం కనికరం లేకుండా నిరాకరించారు.
తన తల్లి మృతదేహం కోసం ఆ 7 ఏళ్ల బాలుడు ఏడుస్తూ వైద్యుల కాళ్లపై పడి ప్రాధేయపడినప్పటికీ.. భూమిపై నడిచే దేవుళ్లుగా భావించే ఆ వైద్యుల మనసు కరగలేదు. దీనితో, కొందరు సామాజిక సేవా నిర్వాహకులు ముందుకు వచ్చి ఆసుపత్రి చికిత్స ఖర్చులను చెల్లించిన తర్వాతే తల్లి మృతదేహాన్ని బాలుడికి అప్పగించారు. అయితే, ఆ తర్వాత మరో ఘోరం జరిగింది. ఆ మహిళ మృతదేహాన్ని తీసుకోవడానికి కానీ, అంత్యక్రియలు నిర్వహించడానికి కానీ ఆమె సొంత బంధువులు ఎవరూ ముందుకు రాకుండా చేతులెత్తేశారు. దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయిన ‘అర్పిత్’ అనే ఆ అమాయక బాలుడు.. తన తల్లి అంత్యక్రియలు చేయడానికి ఎవరైనా ఒక రక్షకుడు రాకపోతారా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూశాడు.
ఎవరూ రాని ఆ క్లిష్ట పరిస్థితిలో, గోండా జిల్లా కలెక్టర్ (District Magistrate) స్వయంగా రంగంలోకి దిగారు. ప్రభుత్వ ఖర్చులతోనే ఆ మహిళ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించారు. ఆ తర్వాతే, ఆ పసివాడు గుండె నిండా దుఃఖం, కన్నీళ్లతో తన తల్లి అంత్యక్రియలను పూర్తి చేశాడు. అంతటితో ఆగకుండా, ఆ జిల్లా కలెక్టర్ ఆ బాలుడి చదువు, పెంపకం మరియు జీవన వ్యయాలన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుందని బాధ్యత తీసుకుని, అతడిని సురక్షితంగా ఒక బాలల సంరక్షణ కేంద్రానికి (చిల్డ్రన్ హోమ్) పంపించారు.

Leave a Reply