ఇంట్లో వారికి పైసా ఇవ్వడు.. పరాయి స్త్రీల మోజులో పడి ₹9 కోట్లు పోగొట్టుకున్న ముసలాయన! అసలు విషయం తెలిస్తే తల బాదుకుంటారు!

ఒక 80 ఏళ్ల వృద్ధుడిని నలుగురు మహిళలు కలిసి ఏకంగా ₹9 కోట్ల రూపాయలకు ముంచేసారు. దేశంలోనే ఇది అతిపెద్ద డిజిటల్ ఫ్రాడ్ (సైబర్ మోసం)గా భావిస్తున్నారు. తాను ఇంత దారుణంగా మోసపోయాననే విషయం తెలిసినప్పటి నుండి ఆ వృద్ధుడి ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా మొదలైన వల:
అసలు విషయానికి వస్తే.. ఏప్రిల్ 2023లో ఫేస్‌బుక్ ద్వారా సదరు వృద్ధుడికి ‘శార్వి’ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ చాటింగ్‌లో మాట్లాడుకోవడం ప్రారంభించారు, ఆ తర్వాత వాట్సాప్ నంబర్లు కూడా మార్చుకోవడంతో వారి బంధం మరింత పెరిగింది. తాను భర్తకు దూరంగా ఉంటూ, పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్నానని శార్వి అతనికి చెప్పింది. ఆ తర్వాత, పిల్లల అనారోగ్యం పేరుతో ఆమె తరచూ డబ్బులు అడగడం ప్రారంభించింది. వృద్ధుడు కూడా ఆమె అడిగినప్పుడల్లా వరుసగా డబ్బులు పంపిస్తూనే వచ్చాడు.

ఇలా డబ్బులు పంపే ప్రక్రియ కొనసాగుతుండగానే, ‘కవిత’ అనే మరో మహిళ వాట్సాప్ ద్వారా ఆ వృద్ధుడిని సంప్రదించింది. శార్వితో ఉన్న పరిచయాన్ని ప్రస్తావిస్తూ, తాను కూడా స్నేహం చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. అంతేకాకుండా కవిత ఆ వృద్ధుడికి అసభ్యకరమైన, రెచ్చగొట్టే సందేశాలను (Messages) పంపడం ప్రారంభించింది. ఆమె కూడా పిల్లల జబ్బుల పేరుతో డబ్బులు వసూలు చేసింది. కథ ఇక్కడితో ఆగలేదు. డిసెంబర్ 2023లో అతనికి ఒక ఇంటర్నేషనల్ నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. ఆ మహిళ తన పేరు ‘దినాజ్’ అని, తాను శార్వికి సోదరినని చెప్పుకుంది. శార్వి చనిపోయిందని, ఆసుపత్రి ఖర్చులు కట్టాలంటూ ఆమె కూడా డబ్బులు గుంజడం మొదలుపెట్టింది.

డబ్బులు తిరిగి అడిగితే.. ప్రాణాలు తీసుకుంటానని బెదిరింపులు:
ఆ మహిళ (దినాజ్) శార్వి మరియు వృద్ధుడి మధ్య జరిగిన పాత వాట్సాప్ చాటింగ్ స్క్రీన్‌షాట్‌లను కూడా షేర్ చేసి బ్లాక్‌మెయిల్ చేసింది. ఆమె కూడా వృద్ధుడి నుండి డబ్బులు తీసుకుని, త్వరలోనే తిరిగి ఇచ్చేస్తానని నమ్మించింది. అయితే, వృద్ధుడు తన డబ్బును తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేయడంతో.. “నా దగ్గర ఏమీ లేదు, నన్ను ఎక్కువగా ఇబ్బంది పెడితే ఆత్మహత్య చేసుకుంటాను, అప్పుడు మీరే ఇరుక్కుంటారు” అని బెదిరించింది. ఈ లోపు ‘జాస్మిన్’ అనే నాల్గో మహిళ కూడా ఈ వలయంలోకి ప్రవేశించింది. ఆమెకు కూడా వృద్ధుడు భారీగా డబ్బులు ఇచ్చుకున్నాడు. ఈ నలుగురు మహిళల బ్లాక్‌మెయిలింగ్ ఏ స్థాయిలో ఉందంటే.. దాదాపు ₹8 కోట్ల 70 లక్షల రూపాయలు సమర్పించుకున్నా వారి ఆశ తీరలేదు. చివరకు ఆ వృద్ధుడు తన కోడలి దగ్గర ₹2 లక్షలు అప్పు తీసుకుని మరీ వారికి పంపించాడు.

కొడుకుని ₹5 లక్షలు అడగడంతో బయటపడ్డ అసలు నిజం:
ఆ తర్వాత ఒకరోజు, ఆ దొంగల ముఠాకు కట్టడానికి డబ్బులు లేక వృద్ధుడు తన కొడుకుని ₹5 లక్షలు ఇవ్వమని అడిగాడు. అయితే కొడుకు గట్టిగా నిలదీశాడు.. “అసలు మీకు అంత డబ్బు ఎందుకు కావాలి? ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తోంది?” అని ప్రశ్నించాడు. దీంతో వృద్ధుడు జరిగిన కథంతా చెప్పగా.. “నాన్నగారు, మిమ్మల్ని ఎవరో దారుణంగా మోసం చేస్తున్నారు” అని కొడుకు నెత్తీనోరూ బాదుకున్నాడు. ఏప్రిల్ 2023 నుండి జనవరి 2025 వరకు అంటే దాదాపు రెండేళ్ల పాటు ఈ దారుణమైన దోపిడీ సాగింది. మొత్తం 734 ట్రాన్సాక్షన్ల ద్వారా ఆ వృద్ధుడు తన జీవితకాల సంపాదననంతా ఊడ్చిపెట్టేశాడు. తాను సర్వస్వం కోల్పోయానని గ్రహించిన ఆ వృద్ధుడు తీవ్ర మానసిక ఆందోళనతో జబ్బుపడ్డాడు. ప్రస్తుతం ఆయన ‘డిమెన్షియా’ (మతిమరుపు/మానసిక రుగ్మత) బారిన పడ్డారని వైద్యులు చెబుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *