ఒక్క బొద్దింక వల్ల విడాకులు తీసుకుంటున్న భార్యాభర్తలు! ఏకంగా 18 సార్లు ఇళ్లు మార్చినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు!

భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు రావడం సర్వసాధారణం. సాధారణంగా ఇలాంటి గొడవలకు చాలా పెద్ద కారణాలే ఉంటాయి. ఆ కారణాలే ముదిరి కాలక్రమేణా విడాకులకు దారితీస్తుంటాయి. కానీ, మధ్యప్రదేశ్‌లో ఒక విచిత్రమైన కేసు వెలుగుచూసింది, అక్కడ కేవలం ఒక బొద్దింక కారణంగా భార్యాభర్తలు విడాకులు తీసుకోబోతున్నారు.

నిజానికి ఆ భార్యకు బొద్దింకలంటే విపరీతమైన భయం. ఆ భయం ఎంతలా ఉందంటే.. ఆమె ఎక్కడైనా బొద్దింకను చూస్తే, ఇంట్లో మిగిలిన సభ్యులు కూడా భయపడిపోయేలా గట్టిగా కేకలు వేస్తుంది. ఆమె ఒక్కసారి వంటగదిలో (కిచెన్) బొద్దింకను చూసిందంటే, ఇక జీవితంలో మళ్లీ ఆ వంటగదిలోకి వెళ్లదు. అంతేకాదు, ఆ ఇల్లు మార్చాల్సిందేనని పట్టుబడుతుంది. భార్యకున్న ఈ వింత భయం వల్ల ఆ భర్త ఇప్పటివరకు ఏకంగా 18 సార్లు ఇళ్లు మార్చాల్సి వచ్చింది.

భార్య ప్రవర్తనతో ఆ భర్త ఇప్పుడు పూర్తిగా విసిగిపోయాడు. దాంతో అతను విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు. “నా భార్య ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు. ఆమె తన భయాన్ని పోగొట్టుకోవడానికి అస్సలు ప్రయత్నించడం లేదు. మేము ఆమెను చాలామంది డాక్టర్లకు కూడా చూపించాము, కానీ ఆమె మందులు వాడటానికి నిరాకరించింది” అని భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు భార్య వాదన వేరేలా ఉంది.. తనకున్న భయాన్ని ఆసరాగా చేసుకుని, తన భర్త తనను పిచ్చిదానిగా నిరూపించాలని చూస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది.

ఈ దంపతులకు 2017లో వివాహం జరిగింది. 2018లో భర్తకు భార్యకున్న ఈ భయం గురించి మొదటిసారి తెలిసింది. అప్పట్లో వంటగదిలో బొద్దింకను చూసిన భార్య గట్టిగా అరుస్తూ బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆమె మళ్లీ కిచెన్‌లోకి వెళ్లలేదు. దాంతో చేసేదేమీ లేక భర్త మొదటిసారి ఇల్లు మార్చాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు ఇళ్లు మార్చి మార్చి అతను అలసిపోయాడు. అందుకే విడాకులు తీసుకోవడం మినహా అతనికి మరో మార్గం కనిపించడం లేదు.

సోషల్ మీడియాలో విడాకులకు దారితీసిన ఈ వింత కారణం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మనందరికీ జీవితంలో ఏదో ఒకదానిపై భయం ఉండటం సహజమే. కానీ, కొందరి భయం వేరే లెవల్‌లో ఉంటుంది. బొద్దింకలంటే భయపడటం సాధారణ విషయమే అయినా, దానివల్ల ఏకంగా విడాకుల వరకు వెళ్లడం మాత్రం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *