పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఉనికిని ప్రమాదంలో పడేసింది. మమతా బెనర్జీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో 58 మంది తమ స్వంత గ్రూపును ఏర్పాటు చేసుకోగా, ఢిల్లీలో కూడా దాదాపు 20 మంది ఎంపీలు టీఎంసీకి దూరమయ్యారు.
ఈ పరిణామాల మధ్య, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి ఒక భారీ ఆఫర్ ఇచ్చారు. టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేయాలని సోనియా గాంధీ ప్రతిపాదించారు. ఇందుకు ప్రతిఫలంగా మమతా బెనర్జీకి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్ష పదవిని ఇస్తామని, ఆమె మేనల్లుడు, ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీకి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెడతామని సోనియా గాంధీ ఆఫర్ చేసినట్లు రాజకీయ వర్గాల సమాచారం.
సోనియా గాంధీ ఇచ్చిన ఆఫర్ ఏమిటంటే: రాజకీయ వర్గాల కథనం ప్రకారం.. టీఎంసీపై బీజేపీ చేస్తున్న రాజకీయ దాడులను తిప్పికొట్టాలంటే పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడమే మార్గమని సోనియా గాంధీ మమతా బెనర్జీకి సూచించారు. లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లాగే టీఎంసీని కూడా బీజేపీ ఇబ్బందులకు గురిచేస్తుందని హెచ్చరించారు. అంతేకాకుండా, టీఎంసీ అంతర్గత నేతలు కూడా అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా ఉన్నారని, అందువల్ల అక్కడ పరిస్థితులు కష్టంగా మారుతున్నాయని గుర్తు చేశారు. సోనియా గాంధీ స్వయంగా మమతకు ఫోన్ చేసి మాట్లాడారని, దీనిపై నిర్ణయం తీసుకోవడానికి మమతా బెనర్జీ కొన్ని రోజుల సమయం అడిగారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
రాహుల్ – అభిషేక్ మధ్య గంటన్నర పాటు భేటీ: మరోవైపు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీల మధ్య ఢిల్లీలోని ’10 జన్ పథ్’ నివాసంలో సుమారు గంటన్నర పాటు కీలక సమావేశం జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చలు సానుకూల వాతావరణంలో సాగినట్లు సమాచారం.
కాంగ్రెస్ అత్యవసర సమావేశం: సోనియా గాంధీ మమతా బెనర్జీకి ఇచ్చిన ఆఫర్ చర్చనీయాంశంగా మారిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జూన్ 11న ఇందిరా భవన్లో ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జ్లు, పిసిసి (PCC) అధ్యక్షుల సమావేశం జరగనుందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.

Leave a Reply