శ్రీ నరేంద్ర మోదీ గారు వరుసగా 4399 రోజుల పాటు భారత ప్రధానమంత్రిగా కొనసాగడం ఖచ్చితంగా అభినందించదగ్గ విషయమే. అయితే, అది జవహర్‌లాల్ నెహ్రూ చారిత్రక రికార్డును బద్దలు కొట్టిందని చెప్పడం పూర్తిగా తప్పు. 1947 నుండి 1952 వరకు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారనే నిజాన్ని ఎవరైనా మరువగలరా? చరిత్ర నుండి తొలగించగలరా? బీజేపీ తమకు అనుకూలమైన లెక్కలను చెప్పుకోవడాన్ని మనం తప్పుబట్టాల్సిన అవసరం లేదు; కానీ మీడియా సంస్థలు ఎలాంటి వివరణ ఇవ్వకుండా బీజేపీ వాదనలను అలాగే ప్రసారం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం విమర్శించారు.
నరేంద్ర మోదీ గారు మొదటిసారిగా 2014 మే 26న భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుండి నేటి (2026 జూన్ 11) వరకు ఆయన నిరంతరాయంగా ప్రధానిగా సేవలందిస్తున్నారు. నిన్నటి (జూన్ 10, 2026) నాటికి ఆయన పదవీకాలం 4,399 రోజులు పూర్తయింది. ఈ లెక్కన, నేటి (2026 జూన్ 11) నాటికి నరేంద్ర మోదీ గారు మొత్తంగా 4,400 రోజులు భారత ప్రధానిగా పదవిలో కొనసాగినట్లయింది. ఈ ప్రస్థానంలో మోదీ గారు గతంలో పనిచేసిన పలువురు ప్రధానమంత్రుల రికార్డులను అధిగమించారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రధానిగా నెహ్రూ గారు కొనసాగిన కాలంతో పోల్చినా మోదీ గారే ముందంజలో ఉన్నారు.
దీని గురించి మరికొంత స్పష్టంగా చూద్దాం.. మన దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15 నుండి 1964 మే 27 వరకు మొత్తం 16 సంవత్సరాల 286 రోజుల పాటు (అంటే 6,130 రోజులు) ప్రధానిగా ఉన్నారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, 1947 నుండి భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన 1952 వరకు ఉన్న కాలం (దాదాపు 4 సంవత్సరాల 8 నెలలు లేదా 1,731 రోజులు) ఆయన ‘తాత్కాలిక ప్రభుత్వానికి’ (ఇంటర్లిమ్ గవర్నమెంట్) ప్రధానిగా వ్యవహరించారు; అంటే అప్పుడు ఆయన ప్రజల ద్వారా నేరుగా ఎన్నుకోబడలేదు.
భారతదేశం 1950లో గణతంత్ర రాజ్యంగా మారిన తర్వాత, లోక్‌సభ ఎన్నికల ద్వారా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రధానిగా నెహ్రూ గారు ‘వరుసగా’ కొనసాగిన పదవీకాలం 1952 ఏప్రిల్ నుండి 1964 మే వరకు, అంటే 4,398 రోజులు.
రికార్డు బద్దలు: నిన్న, 2026 జూన్ 10 నాటికి ప్రధాని మోదీ తన పదవీకాలంలో 4,399 రోజులను పూర్తి చేసుకున్నారు. దీని ద్వారా, ప్రజలచే ఎన్నుకోబడి ‘వరుసగా అత్యధిక రోజులు పదవిలో కొనసాగిన భారత ప్రధాని’గా జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న చారిత్రక రికార్డును నరేంద్ర మోదీ అధికారికంగా అధిగమించారు.
ఇంతకుముందు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గారు రెండు వేర్వేరు కాలాల్లో (1966-1977 మరియు 1980-1984) ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె మొత్తం పదవీకాలం 15 సంవత్సరాల 350 రోజులు (సుమారు 5,825 రోజులు). కానీ, ఇందిరా గాంధీ గారు ‘నిరంతరాయంగా (వరుసగా)’ అత్యంత సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్నది కేవలం 11 సంవత్సరాల 59 రోజులు (అంటే 4,077 రోజులు) మాత్రమే. ఆ రికార్డును ప్రధాని మోదీ గత ఏడాదే అధిగమించారు.
స్వతంత్ర భారత చరిత్రలో, ప్రజాస్వామ్య ఎన్నికల విధానంలో వరుసగా అత్యంత సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేసిన నాయకుడిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. అయినప్పటికీ, తాత్కాలిక ప్రభుత్వ కాలపరిమితిని కూడా కలుపుకుని ‘మొత్తం (ఓవరాల్)’ అత్యధిక రోజులు ప్రధానిగా ఉన్నవారి జాబితాలో నెహ్రూ (మొదటి స్థానం), ఇందిరా గాంధీ (రెండో స్థానం)ల తర్వాత నరేంద్ర మోదీ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నారు.
ఈ వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతూ కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం తన సోషల్ మీడియా పోస్టులో ఇలా పేర్కొన్నారు, “నరేంద్ర మోదీ గారు వరుసగా 4,399 రోజులు ప్రధానమంత్రిగా కొనసాగడం అభినందించదగ్గ విషయమే. కానీ అది జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును దాటేసిందని అనడం తప్పు. 1947 నుండి 1952 వరకు నెహ్రూ ప్రధానిగా ఉన్నారనే నిజాన్ని ఎవరైనా మరువగలరా?
బీజేపీ లెక్కలు వారికి సరిపోవచ్చు, దానిపై వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. కానీ మీడియా సంస్థలు ఎలాంటి వివరణ లేకుండా బీజేపీ వాదనలను ప్రసారం చేయడమే ఆశ్చర్యకరం. ప్రధాని నరేంద్ర మోదీ గారి 12 ఏళ్ల (దాదాపు) సుదీర్ఘ ప్రస్థానాన్ని అభినందిద్దాం. అదే సమయంలో భారతరత్న నెహ్రూ గారి 17 ఏళ్ల చారిత్రక రికార్డును కూడా గౌరవిద్దాం.
1947 నుండి 1952 వరకు శైశవ దశలో ఉన్న భారత ప్రజాస్వామ్యాన్ని అక్కున చేర్చుకుని, పెంచి పోషించిన ఘనత జవహర్‌లాల్ నెహ్రూ గారిదేనని మనం గుర్తుంచుకోవాలి” అని చిదంబరం వ్యాఖ్యానించారు.
మరోవైపు చిదంబరం చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. “1947 నుండి 1952 వరకు నెహ్రూ ఏ దేశ పౌరుల ఓట్లతో ప్రధాని పదవిని చేపట్టారో చెప్పగలరా? ఆ పదవి కూడా మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ త్యాగం చేయడం వల్ల నెహ్రూకు దక్కిందనేది చరిత్ర సత్యం!” అంటూ వారు ఎదురుదాడికి దిగారు.

Leave a Reply