“డీఎస్పీ యూనిఫామ్‌లో ముగ్గురు పిల్లల తల్లి హల్‌చల్!”.. వేలూరు కోటలో బందోబస్తు బిల్డప్.. బర్త్‌డే కేక్ కట్ చేసే చోట ఊహించని ట్విస్ట్!

తమిళనాడు వేలూరు కోట పార్కులో తన బాయ్‌ఫ్రెండ్ పుట్టినరోజును వినూత్నంగా సెలబ్రేట్ చేయడం కోసం.. ఏకంగా డీఎస్పీ (DSP) పోలీస్ యూనిఫామ్ ధరించి వచ్చి హల్చల్ చేసిన ఉమామహేశ్వరి (33) అనే ముగ్గురు పిల్లల తల్లిని వేలూరు నార్త్ పోలీసులు అరెస్ట్ చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వేలూరు నేమబంతపురం గ్రామానికి చెందిన, కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఈమె భర్త ఒక రోజువారీ కూలి. నిన్న సాయంత్రం ఉమామహేశ్వరి పక్కాగా డీఎస్పీ యూనిఫామ్ ధరించి, ఆర్టీసీ ప్రభుత్వ బస్సులోనే ఎక్కి వేలూరు కోటకు చేరుకుంది. అక్కడ డ్యూటీలో ఉన్న అధికారి తరహాలో అటు ఇటూ తిరుగుతూ నానా హంగామా చేసింది.

ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అడ్డుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించి రాత్రంతా విచారించారు.

పోలీసుల విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. ఈ ఉమామహేశ్వరి గతంలో చెన్నైలో ఇళ్లల్లో పనిమనిషిగా ఉంటూ రెండు చోట్ల బంగారం, వజ్రాభరణాలను దొంగిలించిన కేసుల్లో నిందితురాలని, ఒక ఘరానా దొంగ అని తేలింది. తన బాయ్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేయడానికే ఈ నకిలీ పోలీస్ వేషం వేసుకుని వచ్చినట్లు నిందితురాలు అంగీకరించింది.

అయితే, పోలీసులు ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు ఫోన్ చేసి విచారించగా మరో ట్విస్ట్ ఎదురైంది. “ఈరోజు నా పుట్టినరోజు అన్న మాట నిజమే.. కానీ నేను కేక్ కట్ చేయడానికి కోటకు రాలేదు, అసలు ఆమెతో నాకు సంబంధం లేదు” అని చెప్పి పోలీసులకే షాక్ ఇచ్చాడు.

బాయ్‌ఫ్రెండ్ రాకపోయినప్పటికీ ఈ మహిళ ఎందుకు డీఎస్పీ యూనిఫామ్ వేసుకుని తిరిగింది? ఈ ఖరీదైన ఆఫీసర్ యూనిఫామ్, నక్షత్రాల బ్యాడ్జీలు ఆమెకు ఎక్కడి నుండి లభించాయి? అనే కోణంలో పోలీసులు ఆమె భర్తను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ప్రస్తుతం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *