న్యూఢిల్లీ: ఒక మ్యాచ్‌మేకింగ్ (పెళ్లి సంబంధాలు చూసే) ప్లాట్‌ఫారమ్.. ఒక ఐపీఎస్ (IPS) అధికారి కుమార్తె పెళ్లి కోసం పెట్టిన షరతులను బహిరంగపరిచింది. 32 ఏళ్ల సదరు మహిళకు.. అయితే ‘అగ్రకులం’ కు చెందిన వరుడు కావాలి, లేదా ఏడాదికి ₹80 లక్షల ఆదాయం సంపాదించేవాడైనా అయి ఉండాలి. ఈ డిమాండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో కులం, డబ్బు చుట్టూ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
‘డేట్ క్రూ’ (Date Crewe) అనే మ్యాచ్‌మేకింగ్ ప్లాట్‌ఫారమ్ సీఈఓ (CEO) ఓండ్రిలా కపూర్ ఇటీవల ఒక విడాకులు తీసుకున్న వ్యక్తి పెట్టిన వింత డిమాండ్లను సోషల్ మీడియాలో పంచుకుని వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె.. మరో యువతి పెట్టిన వింత షరతులను బయటపెట్టారు. సాధారణంగా పెళ్లి విషయంలో అమ్మాయిలు, అబ్బాయిలకు తమదైన ఇష్టాలు, అంచనాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక ఐపీఎస్ అధికారి కుమార్తె తన కాబోయే భర్త కోసం నిర్దేశించిన ప్రమాణాలు హాట్ టాపిక్‌గా మారాయి.
అంతలా సంచలనం రేపిన ఆ యువతి డిమాండ్లు ఏమిటి? ఆ యువతి పెట్టిన ప్రధాన షరతు ఏంటంటే.. తన భర్త కాబోయేవాడు అయితే ‘అగ్రకులం’ వాడు అయి ఉండాలి, ఒకవేళ కులం కుదరకపోతే అతని వార్షిక సంపాదన కనీసం 80 లక్షల రూపాయలు ఉండాలి. ఆమె అంతర కుల వివాహానికి (Inter-caste marriage) సిద్ధంగా ఉన్నప్పటికీ.. దానికి ఒక కండిషన్ పెట్టింది; ఎదుటి వ్యక్తి ఉన్నత కులానికి చెందినవాడైనా కావాలి లేదా ఏడాదికి ₹80 లక్షల శాలరీ అయినా కలిగి ఉండాలి.
ఓండ్రిలా కపూర్ ఈ విషయాన్ని తన లింక్డ్‌ఇన్ (LinkedIn) ప్రొఫైల్‌లో షేర్ చేయడంతో ఈ వ్యవహారం కాస్తా తీవ్ర చర్చకు దారితీసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అంత పెద్ద డిమాండ్ పెట్టిన సదరు యువతి ఒక ఉన్నత విద్యావంతుల కుటుంబం నుండి వచ్చింది. ఆమె తండ్రి ఒక ఐపీఎస్ అధికారి కాగా, తల్లి ఒక ఉపాధ్యాయురాలు. ఇంత మంచి విద్యా నేపథ్యం (Educational Background) ఉన్నప్పటికీ.. వరుడి విషయంలో ఆమె ఆలోచనలు చాలా మందికి తిరోగమన (పాతకాలపు) ఆలోచనలుగా అనిపిస్తున్నాయి. తాను బ్రాహ్మణ లేదా రాజ్‌పుత్ వంటి ఉన్నత కులాల అబ్బాయిలను మాత్రమే పెళ్లి చేసుకుంటానని, ఒకవేళ ఆ కులాల వారు కాకపోతే అబ్బాయి ప్యాకేజీ ఖచ్చితంగా ₹80 లక్షలు ఉండాలని ఆమె స్పష్టం చేసింది.
32 ఏళ్ల ఆ మహిళ స్వయంగా ఒక ఫ్యాషన్ కంపెనీని నడుపుతోందని ఓండ్రిలా తెలిపారు. “కాగితాలపై చూస్తే ఆమె చాలా చదువుకున్న కుటుంబం నుండి వచ్చింది. తండ్రి ఐపీఎస్, తల్లి టీచర్.. అయినప్పటికీ ఆమె మా ముందు ఇలాంటి షరతులు పెట్టింది. ఆమె కేవలం బ్రాహ్మణ, రాజ్‌పుత్ మరియు కొన్ని ఎంపిక చేసిన కులాల్లో మాత్రమే పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతోంది” అని ఓండ్రిలా తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
సదరు యువతి ఆలోచన ప్రకారం.. అయితే కులం బలంగా ఉండాలి, లేదా పైసా (డబ్బు) బలంగా ఉండాలి. ఈ విషయం సోషల్ మీడియాలోకి రావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ.. “భారతదేశంలో పెళ్లి అనేది కేవలం డబ్బుల లావాదేవీలా మారిపోయింది” అని విమర్శించారు. మరో యూజర్.. “భారతదేశంలో అరేంజ్డ్ మ్యారేజెస్ లో ఇలా జరగడం చాలా సాధారణం” అని అభిప్రాయపడ్డారు. మరొకరు కామెంట్ చేస్తూ.. “ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది పాశ్చాత్య సంస్కృతి. భారతదేశంలో పరిస్థితి వేరు, ఇక్కడ రెండు కుటుంబాల ఆర్థిక, సామాజిక హోదాలను (Status) బేరీజు వేస్తారు” అని పేర్కొన్నారు. అయితే, మరికొందరు ఓండ్రిలాపైనే అనుమానం వ్యక్తం చేస్తూ.. ఆమె తన వెబ్‌సైట్ ప్రమోషన్ కోసమే ఇలాంటి కథలు అల్లుతోందని ఆరోపించారు.

Leave a Reply