భారత్‌లో 3 నెలలు ఒంటరిగా తిరిగిన జపాన్ యువతి.. దేశంలోని ఆ 5 నగరాలు అత్యంత ‘అసురక్షితం’ అంటూ సంచలన వీడియో!

గత మూడు నెలలుగా ఒంటరిగా భారతదేశంలో పర్యటిస్తున్న ఒక జపాన్ మహిళా పర్యాటకురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట తీవ్ర కలకలం రేపుతోంది. ‘హన్నా జపానా’ అనే ఈ పర్యాటకురాలు తన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా భారతదేశంలో తనకు అత్యంత “అసురక్షితంగా” అనిపించిన నగరాల జాబితాను విడుదల చేసింది.

తన పర్యటనలో చాలా మంది మంచి వ్యక్తులు కలిశారని, అద్భుతమైన ప్రాంతాలను సందర్శించానని ఆమె అంగీకరించినప్పటికీ, ఐదు నిర్దిష్ట నగరాలు మాత్రం ఆమెను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ఆమె పేర్కొన్న ఆ ఐదు నగరాల వివరాలు కింద ఇవ్వబడ్డాయి:

  1. గువహటి (అస్సాం):
    హన్నా ఈ జాబితాలో అస్సాంలోని గువహటిని ఐదో స్థానంలో ఉంచింది. అక్కడ తనతో ఎలాంటి పెద్ద అవాంఛనీయ సంఘటన జరగనప్పటికీ, ఈశాన్య (నార్త్-ఈస్ట్) భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే గువహటి వీధుల్లో ఒంటరిగా నడవడానికి తాను కాస్త అసౌకర్యంగా, ఆందోళనగా ఫీలయ్యానని ఆమె తెలిపింది.
  2. ఢిల్లీ:
    ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ నాల్గవ స్థానంలో ఉంది. తాను మూడుసార్లు ఢిల్లీకి వెళ్లానని, ప్రతిసారీ అనారోగ్యానికి గురయ్యానని హన్నా పేర్కొంది. అక్కడి వాతావరణం, కాలుష్యం తన ఆరోగ్యానికి అస్సలు పడలేదని ఆమె అభిప్రాయపడింది.
  3. ముంబై:
    సాధారణంగా ముంబై నగరాన్ని భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా భావిస్తారు. కానీ, హన్నా తన లిస్ట్‌లో ఈ మహానగానికి మూడో స్థానం ఇచ్చింది. ముంబైలో తాను లైంగిక వేధింపులను (Sexual Harassment) ఎదుర్కొన్నట్లు ఆమె షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ చేదు అనుభవం ముంబై నగరంపై తనకు చాలా చెడ్డ జ్ఞాపకాలను మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేసింది.
  4. రక్సాల్ (బీహార్):
    నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉన్న బీహార్‌లోని రక్సాల్ పట్టణాన్ని ఆమె రెండో స్థానంలో ఉంచింది. హన్నా తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, ఆమె విదేశీయురాలు కావడంతో అక్కడి చాలా హోటళ్లు రూమ్ ఇవ్వడానికి నిరాకరించాయి. మరికొన్ని హోటళ్లు భారీ ధరలను డిమాండ్ చేశాయి. ఈ సమయం తన మొత్తం భారత పర్యటనలోనే అత్యంత మానసిక ఒత్తిడితో కూడుకున్నదిగా ఆమె వివరించింది.
  5. వారణాసి (కాశీ):
    ఈ జాబితాలో ఆధ్యాత్మిక నగరమైన వారణాసి మొదటి స్థానంలో నిలిచింది. ఈ నగరంలోనే కొందరు వ్యక్తులు తనను విపరీతంగా వెంబడించారని (Stalking) హన్నా ఆరోపించింది. ఒకానొక సమయంలో తనకేదో కీడు జరగబోతోందని తీవ్ర భయానికి లోనైనట్లు చెప్పింది. అయితే, వారణాసిలోనే అత్యంత భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నప్పటికీ, ఈ నగరం తనకు ఎంతో ఇష్టమైన ప్రాంతాలలో ఒకటిగా నిలిచిందని ఆమె అనడం గమనార్హం. ప్రయాణంలో సవాళ్లు, అందాలు రెండూ పక్కపక్కనే సాగుతాయని ఆమె వ్యాఖ్యానించింది.

నెటిజన్ల స్పందన:
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్ల నుండి కామెంట్ల వరద ముంచెత్తింది. హన్నాకు ఎదురైన చేదు అనుభవాలకు గాను చాలా మంది భారతీయ యూజర్లు ఆమెకు క్షమాపణలు చెప్పారు. ముఖ్యంగా ముంబై, గువహటి నగరాలకు చెందిన ప్రజలు ఈ ఘటనపై తీవ్ర విచారం, విస్మయం వ్యక్తం చేశారు. ముంబైకి చెందిన ఒక యువతి కామెంట్ చేస్తూ.. “జనాలు ముంబై సురక్షితం అని ఎంత చెప్పినా, వాస్తవానికి ఇక్కడ అమ్మాయిలు సేఫ్ కాదు” అని రాసుకొచ్చింది. మరికొందరు నెటిజన్లు హన్నాకు సలహా ఇస్తూ.. తదుపరిసారి భారతదేశానికి వచ్చినప్పుడు దక్షిణ భారతదేశాన్ని (South India) లేదా మహిళలకు అత్యంత రక్షణగా ఉండే నాగాలాండ్, మిజోరాం వంటి ఈశాన్య రాష్ట్రాలను సందర్శించాలని కోరారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *