హైదరాబాద్‌లో ఘోరం: పెళ్లయిన పదేళ్లకు భార్యను గొంతుకోసి చంపిన భర్త.. ఫోన్ ఎత్తకపోవడంతో ఇంటికెళ్లిన సోదరికి షాక్!

హైదరాబాద్: నగరంలోని బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఆదివారం బహదూర్‌పురా పరిధిలోని కిషన్‌బాగ్‌లో చోటుచేసుకుంది.

పోలీసుల సమాచారం ప్రకారం.. మృతురాలిని నిషాత్ బేగంగా గుర్తించారు. ఆమెకు 2016లో సులేమాన్ అనే వ్యక్తితో వివాహమైంది. పెళ్లయినప్పటి నుండి వీరిద్దరి మధ్య కుటుంబ సమస్యలపై తరచూ గొడవలు జరుగుతుండేవి. పలుమార్లు కుటుంబ పెద్దలు ఇరుపక్షాలకూ నచ్చజెప్పి శాంతియుతంగా కలిసి ఉండాలని కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు.

ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం:

కొన్నేళ్ల క్రితం నిషాత్ తన భర్త సులేమాన్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయితే ఆ తర్వాత ఇరు కుటుంబాల సమక్షంలో రాజీ కుదరడంతో మళ్లీ కలిసి జీవించడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం కిషన్‌బాగ్‌లోని తన ఇంట్లో ఉన్న నిషాత్‌కు ఆమె తల్లి, సోదరి పలుమార్లు ఫోన్ చేశారు. ఎంతకీ ఆమె ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన సోదరి.. నిషాత్ క్షేమ సమాచారం తెలుసుకోవడానికి నేరుగా ఆమె ఇంటికి వెళ్లింది. అక్కడ లోపలికి వెళ్లి చూడగా నిషాత్ రక్తపు మడుగులో పడి మరణించి ఉండటం చూసి ఆమె దిగ్భ్రాంతికి గురైంది.

కత్తితో గొంతు కోసి..

ఈ ఘోర ఉదంతంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫలక్‌నుమా ఏసీపీ ఎం.ఎ. జావేద్ ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ.. “ఆదివారం సులేమాన్, అతని భార్య నిషాత్ మధ్య ఏదో విషయమై తీవ్రమైన గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన సులేమాన్, కత్తితో నిషాత్ గొంతు కోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిందితుడిపై కేసు నమోదు చేశాం, అతడిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి” అని తెలిపారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *