‘భారత్‌పై దాడి చేసేవాళ్లకే యూరప్ ఆయుధాలు అమ్ముతోంది’.. రష్యా చమురు కొనుగోళ్లపై నీతులు చెప్పే దేశాలకు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్!

న్యూఢిల్లీ: రష్యా నుండి భారత్ ముడి చమురు కొనుగోలు చేయడంపై అంతర్జాతీయ వేదికలపై నీతులు చెప్పే పాశ్చాత్య దేశాలకు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తనదైన శైలిలో ఘాటైన సమాధానం ఇచ్చారు. రష్యా విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానాలపై యూరప్ చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. భారత్‌కు వ్యతిరేకంగా దాడులు చేసే దేశాలకు యూరప్ దేశాలే ఆయుధాలు అమ్ముతున్నాయని, ఆ ఆయుధాలు ఎన్నో ఏళ్లుగా భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించబడుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మాస్కోపై ఆంక్షలు విధించిన తరుణంలో.. ప్రపంచ చమురు మార్కెట్‌ను స్థిరంగా ఉంచడం కోసం 2022లో స్వయంగా అమెరికానే భారత్‌ను రష్యా ముడి చమురు కొనుగోలు చేయమని ప్రోత్సహించిందని జైశంకర్ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఫిన్లాండ్‌లో జరిగిన కుల్తారంత చర్చల (Kultaranta Talks) లో “ఉద్భవిస్తున్న శక్తులు – కొత్త భూరాజకీయ పోటీ” అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైనప్పటి నుండి భారత్.. రష్యా పట్ల ఎక్కువ సానుభూతి చూపిస్తోందని, రష్యా చమురుపై విపరీతంగా ఆధారపడుతోందంటూ వచ్చిన ప్రశ్నకు ఆయన తీవ్రంగా స్పందించారు.

యూరప్ ఆయుధాలతోనే భారత్‌పై దాడులు:
జైశంకర్ మాట్లాడుతూ.. “ఏ యూరప్ దేశంపైనా భారతీయ ఆయుధాలతో దాడి జరగలేదు. భారత్‌కు వ్యతిరేకంగా ఆయుధాలు సరఫరా చేసే విషయంలో యూరప్ గురించి కూడా నేను ఇదే మాట చెప్పగలిగితే బాగుండేది” అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై మరింత వివరణ ఇవ్వాలని కోరగా.. “యూరప్ దేశాలు ఆయుధాలు అమ్ముతున్నాయి, ఆ ఆయుధాలు భారత్‌పై దాడి చేయడానికి ఉపయోగించబడుతున్నాయి. ఇది ఇప్పటిది కాదు, ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. మేము భారతీయులం ఎప్పుడూ యూరప్‌ను ప్రమాదంలో నెట్టేలాంటి పనులు చేయలేదు. ఇది చాలా తార్కికమైన విషయం అని నేను భావిస్తున్నాను” అని స్పష్టం చేశారు.

రష్యా నుండి భారత్ చమురు ఎందుకు కొనుగోలు చేస్తోంది?
రష్యా తక్కువ ధరకు చమురు అందిస్తోందని, ప్రపంచ సరఫరా మార్కెట్లోకి చౌక చమురు రావడం వల్లే అంతర్జాతీయంగా ఇంధన ధరలు స్థిరంగా ఉంటున్నాయని విదేశాంగ మంత్రి వివరించారు. భారత్ రష్యా నుండి చమురు కొనడంలో ఆర్థిక ప్రయోజనాలే కీలకమని, ఇందులో ఎలాంటి భూరాజకీయాలు (Geopolitics) లేవని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మారిన అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల వల్ల రష్యా ముడి చమురు భారత్‌కు అత్యంత అనుకూలమైన ప్రత్యామ్నాయంగా మారిందన్నారు.

అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో సంక్షోభాన్ని నివారించడానికి రష్యా నుండి చమురు కొనుగోళ్లను కొనసాగించాలని ఆనాడు అమెరికానే భారత్‌ను కోరినట్లు జైశంకర్ వెల్లడించారు. “ఆ సమయంలో చమురు మార్కెట్‌ను అదుపులో ఉంచడానికి రష్యా నుండి నేరుగా చమురు కొనాలని అమెరికా భారత్‌ను అభ్యర్థించింది. మేము కేవలం ధర, లభ్యత ఆధారంగానే చమురు కొనుగోలు చేస్తాము” అని పేర్కొన్నారు.

మార్కెట్ పరిస్థితులే కారణం:
భారత్ వైఖరిని మరింత స్పష్టం చేస్తూ విదేశాంగ మంత్రి.. “నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మేము ఇంధన ధర మరియు అది ఎంతవరకు అందుబాటులో ఉందనే దాన్ని బట్టే కొంటాం. ఆ సమయంలో మార్కెట్లో అందుబాటులో ఉన్న చమురులో ఎక్కువ భాగం రష్యాదే. ఎందుకంటే యూరప్ దేశాలన్నీ అప్పటికే మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాచ్యం) నుండి చమురు కొనుగోలు చేయడం ప్రారంభించాయి. నిజానికి మిడిల్ ఈస్ట్ మాకు సాంప్రదాయ చమురు సరఫరాదారు. యూరప్ దేశాల కొనుగోళ్ల వల్ల మారిన పరిస్థితులు మమ్మల్ని రష్యా వైపు వెళ్లేలా చేశాయి” అని జైశంకర్ వివరించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *