మనవళ్లు సేవ చేయలేదని.. రాసిచ్చిన 7.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్న 89 ఏళ్ల వృద్ధురాలు! కోర్టులో తగిన బుద్ధి

లాతూర్: నేటి ఆధునిక కాలంలో ఆస్తులు, అంతస్తులు, డబ్బు ముందు రక్తసంబంధాల విలువ వెలవెలబోతోంది. ఆస్తిపై ఆశతో అబద్ధపు వాగ్దానాలు చేయడం, అంతా దక్కాక కన్నవారిని, పెద్దలను బాధ్యతారాహిత్యంగా వదిలేయడం వంటి ఘటనలు రోజూ ఎక్కడో ఒకచోట చూస్తూనే ఉన్నాం.

ఇలాంటి బంధాలకు కళంకం తెచ్చే ఘటనే మహారాష్ట్రలోని లాతూర్ నుండి వెలుగులోకి వచ్చింది. వృద్ధాప్యంలో తమకు తోడుగా ఉంటారు, సంరక్షిస్తారు, జీవిత చరమాంకంలో అండగా నిలుస్తారనే ఆశతో ఒక 89 ఏళ్ల వృద్ధురాలు తనకున్న 7.5 ఎకరాల భూమిని మనవడు, మునిమనవడి పేరిట రాసిచ్చింది. అయితే, ఆస్తి చేతికి రాగానే ఆ ఇద్దరూ ఆమెను నిర్లక్ష్యం చేశారు. సంరక్షించాల్సిన బాధ్యతను విస్మరించారు. కానీ, ఆ వృద్ధురాలు ఇతరులలాగా నిరాశతో లొంగిపోలేదు; న్యాయపోరాటానికి సిద్ధపడింది. న్యాయం కోసం ఆమె ‘సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్’ (Senior Citizen Tribunal) ను ఆశ్రయించింది. కోర్టు కూడా సంచలన తీర్పునిస్తూ.. ఆ వృద్ధురాలికి అనుకూలంగా నిర్ణయం ప్రకటించింది. గతంలో చేసిన ‘గిఫ్ట్ డీడ్’ (బహుమతి పత్రం)ను రద్దు చేస్తూ, ఆ 7.5 ఎకరాల భూమిని తిరిగి ఆమె పేరు మీదే మార్చాలని ఆదేశించింది.

అసలేం జరిగిందంటే?
ఈ ఘటన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా కర్సా గ్రామంలో జరిగింది. ఇక్కడ నివసించే 89 ఏళ్ల హౌసాబాయి లహాడేకు సుమారు 3 హెక్టార్ల (దాదాపు 7.5 ఎకరాలు) వ్యవసాయ భూమి ఉంది. వయసు పైబడుతుండటంతో ఆమె ఒక రిజిస్టర్డ్ ‘గిఫ్ట్ డీడ్’ ద్వారా ఆ భూమి మొత్తాన్ని తన మనవడు, మునిమనవడి పేరిట రాసిచ్చింది.

భూమిని బదిలీ చేయడానికి వెనుక ఉన్న ముఖ్య నిబంధన ఏమిటంటే.. ఆ ఇద్దరూ కలిసి వృద్ధాప్యంలో ఉన్న ఆమెకు సేవ చేయాలి, ఆమె తిండి, బట్టలు, మందుల ఖర్చులన్నీ భరించాలి. కానీ, భూమి చేతికి రాగానే ఇద్దరూ తమ బాధ్యతల నుండి తప్పుకుని, వృద్ధురాలిని దిక్కులేని దానిని చేశారు.

చట్టబద్ధంగా బుద్ధి చెప్పిన బామ్మ:
హౌసాబాయి లహాడేకు స్వంత సంతానం లేదు, అందువల్ల ఆమె తన సోదరుడి పిల్లలను దత్తత తీసుకుంది. మనవడు, మునిమనవడు చేసిన ఈ నమ్మకద్రోహానికి హౌసాబాయి కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చోలేదు. చేతులు చాచి దీనంగా బతిమాలే కన్నా, హక్కుల కోసం పోరాడాలని నిశ్చయించుకుంది. మోసగాళ్ల చట్రం నుండి తన 7.5 ఎకరాల సారవంతమైన భూమిని తిరిగి లాక్కుంది.

హౌసాబాయి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి.. ‘తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల పోషణ మరియు సంక్షేమ చట్టం, 2007’ (Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007) కింద కేసు నమోదు చేసింది.

కోర్టు చారిత్రాత్మక తీర్పు:
ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ అధికారి రోహిణి నర్హే-విరోలే ఈ మొత్తం ఉదంతంపై విచారణకు ఆదేశించారు. ఇరుపక్షాల వాదనలు విన్నారు. మనవడు, మునిమనవడు భూమి దక్కించుకున్నాక ఆ వృద్ధురాలిని మోసం చేసినట్లు కోర్టు నిర్ధారించింది. పెద్దలను చూసుకోవడం అనేది కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదని కోర్టు స్పష్టం చేసింది. ఒక ఆస్తిని తమను చూసుకుంటారనే షరతుపై బదిలీ చేసినప్పుడు, ఆ బాధ్యతను నెరవేర్చడానికి చట్టబద్ధంగా కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది.

ఈ క్రమంలోనే బామ్మ చేసిన ‘గిఫ్ట్ డీడ్’ను రద్దు చేస్తూ, 7.5 ఎకరాల భూమి యాజమాన్య హక్కులను వెంటనే ఆమెకు తిరిగి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు, వివాదాస్పద కాలంలో ఆ భూమిపై వచ్చిన పంటల ఆదాయం, ప్రభుత్వ సబ్సిడీలు లేదా పంట బీమా డబ్బులు ఏవైతే మనవళ్లు తీసుకున్నారో, వాటన్నింటినీ తిరిగి బామ్మకు చెల్లించాలని స్పష్టం చేసింది. బామ్మకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *