బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో మానవ సంబంధాలను మంటగలిపే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలి ప్రవర్తనపై పెంచుకున్న అనుమానంతో ఓ యువకుడు ఆమెతో గొడవ పడ్డాడు. ఆ గొడవ ముదిరి ఆవేశంలో ఊగిపోయిన ప్రియుడు.. కత్తితో ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన పుర్వా లెప్చా (25) అనే యువకుడికి, సిక్కిం రాష్ట్రానికి చెందిన అతి హంగ్మా సుభా (22) అనే యువతితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ మొదట స్నేహితులుగా ఉండేవారు.
తర్వాత వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్న వీరు, వివిధ ప్రాంతాల్లో కలిసి నివసిస్తూ వేర్వేరుగా ఉద్యోగాలు చేసేవారు. ఈ క్రమంలోనే సుమారు నెల రోజుల క్రితం ఈ జంట ఉపాధి నిమిత్తం బెంగళూరుకు చేరుకున్నారు.
అసలేం జరిగిందంటే?
బెంగళూరుకు వచ్చిన ఈ జంట దొడ్డనహళ్లిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కలిసి ఉండటం ప్రారంభించారు. పుర్వా ఒక ప్రైవేట్ హోటల్‌లో పనిలో చేరగా.. అతి ఒక సెలూన్‌లో రిసెప్షనిస్ట్‌గా ఉద్యోగంలో చేరింది. అయితే, గత కొద్దికాలంగా తన ప్రియురాలు అతి ప్రవర్తనపై పుర్వాకు అనుమానం మొదలైంది. ఆమె వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని పుర్వా భావించాడు.
తాను మోసపోతున్నానని, అతి తనను వదిలేసి తన ప్రియుడికే ప్రాధాన్యత ఇస్తుందేమోనని పుర్వా నిరంతరం ఆందోళన చెందేవాడు. ఈ విషయమై ఈరోజు ఉదయం వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో తీవ్ర ఆవేశానికి లోనైన పుర్వా.. కత్తితో ప్రియురాలు అతి గొంతు కోశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో కొట్టుకుంటూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బెల్లందూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply