మస్కట్: నడిసముద్రంలో ఒక అంతర్జాతీయ చమురు నౌకలో భారతీయ నావికుడి మృతదేహానికి జరిగిన ఘోర అవమానం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓమన్ దేశ సముద్ర పరిధిలో ప్రయాణిస్తున్న ‘ఎమ్.టి సెలెస్టియల్’ (MT Celestial) అనే ఆయిల్ ట్యాంకర్ నౌకలో పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన 35 ఏళ్ల భారతీయ నావికుడు నిషాంత్ ఉయిర్దనాథన్ తీవ్ర అనారోగ్యంతో జూన్ 11వ తేదీన మరణించాడు.
సకాలంలో అందని వైద్యం:
నౌకలోని తోటి సిబ్బంది మరియు భారతీయ నావికుల సంఘం (Indian Seafarers Association) తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 8వ తేదీ నుంచే నిషాంత్ ఆరోగ్యం క్షీణించింది. అయితే ఆ సముద్ర ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడం వల్ల అతనికి సకాలంలో వైద్య సాయం అందించడం కానీ, అత్యవసరంగా ఒడ్డుకు చేర్చే రెస్క్యూ ఆపరేషన్లు కానీ నిర్వహించడం సాధ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
శవం కుళ్ళిపోకుండా వినూత్న ప్రయత్నం:
కప్పల్ (నౌక) యాజమాన్యం తమను పూర్తిగా గాలికొదిలేసిందని ఆరోపిస్తూ ఆ నౌక కెప్టెన్ రాజేంద్ర యాదవ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేస్తూ భారత ప్రభుత్వం సాయం చేయాలని అభ్యర్థించారు. నిషాంత్ మరణించిన తర్వాత, సదరు నౌకలో శవాలను భద్రపరిచే మార్చురీ (Savage Room) లేదా సరైన కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు లేకపోవడంతో.. తీవ్రమైన వేడికి నిషాంత్ మృతదేహం క్రమంగా కుళ్ళిపోవడం ప్రారంభమైంది.
దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన తోటి సిబ్బంది, మృతదేహం మరింత సిధ్ధిలం కాకుండా కాపాడుకునేందుకు వేరే దారి లేక ఫ్రిజ్లో ఉండే చల్లటి తాగునీటి బాటిళ్లను (Cool Water Bottles) శవం చుట్టూ అడ్డుగా పేర్చారు. ఒకవైపు ప్రాణ స్నేహితుడు చనిపోయాడనే బాధ, మరోవైపు కళ్ల ముందే శవం కుళ్ళిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయతతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. నౌకలోనే శవం కుళ్ళిపోతుండటం వల్ల తమకు కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు (Health Hazards) వచ్చే ప్రమాదం ఉందని నావికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రంగంలోకి దిగిన భారత రాయబార కార్యాలయం:
ఈ భయంకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారత్ స్పందించింది. ఓమన్ రాజధాని మస్కట్లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుంది. నౌక యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, మరణించిన నావికుడు నిషాంత్ భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి (భారతదేశానికి) తీసుకురావడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు రాయబార కార్యాలయం అధికారికంగా భరోసా ఇచ్చింది.

Leave a Reply