లంచం ఇవ్వాలంటూ టార్చర్.. “శిక్ష పడే వరకు నా శవాన్ని తగబెట్టకండి!”.. లేఖ రాసిపెట్టి యువ పోస్ట్ మాస్టర్ ఆత్మహత్య..!!!

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మైన్‌పురి జిల్లాలో, ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక 26 ఏళ్ల యువ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది.

మైన్‌పురి జిల్లాలోని ముదాయి సబ్ పోస్ట్ ఆఫీసులో నిఖిల్ వర్మ అనే యువకుడు అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, నిఖిల్ తన ఇంటి సమీపంలోని పొలాల్లో ఉన్న ఒక గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

ఆ తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిఖిల్ చొక్కా జేబులో నుంచి మూడు పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన ఉన్నతాధికారులు తనను నిరంతరం మానసికంగా వేధిస్తూ, లంచం ఇవ్వాలంటూ బెదిరించినట్లు అత్యంత ఉద్వేగభరితంగా రాశాడు. “నాకు న్యాయం జరిగి, నా చావుకు కారణమైన నేరస్థులకు శిక్ష పడే వరకు నా మృతదేహాన్ని దహనం చేయవద్దు” అని నిఖిల్ తన కుటుంబ సభ్యులను ఆ లేఖలో ఆఖరి కోరికగా కోరడం అందరినీ కలచివేస్తోంది.

లీవ్ కావాలంటే లంచం ఇయ్యాలట!
మృతుడి తండ్రి ధర్మేంద్ర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. నిఖిల్ సెలవులను (లీవ్స్) మంజూరు చేయడం కోసం ‘మెయిల్ ఓవర్సీయర్’ అనే అధికారి నిరంతరం డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఈ లంచం సొమ్ములో ‘పోస్టల్ సూపరింటెండెంట్’కు కూడా వాటా ఉందని, డబ్బులు ఇవ్వకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ నిఖిల్‌ను మానసికంగా నలిపేసారు.

దీనితో తీవ్ర మనస్తాపానికి, మానసిక ఒత్తిడికి గురైన నిఖిల్ అంతిమంగా ఈ ఘోర నిర్ణయం తీసుకున్నాడు. ఈ దారుణ ఘటనపై స్పందించిన పోలీసులు.. పోస్టల్ సూపరింటెండెంట్ మరియు మెయిల్ ఓవర్సీయర్ అనే ఇద్దరు ఉన్నతాధికారులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ ఇద్దరు నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.


Posted

in

by

Tags: