చికెన్ రైస్ తీసుకురావాలని భర్తను పంపి.. ప్రియుడితో నడిరోడ్డుపై హత్య చేయించింది! ఫోన్ చేసి “కార్యక్రమం ఓకే” అన్నాడు.. ప్రియాంక మర్డర్ ప్లాన్ వెనుక షాకింగ్ ట్విస్ట్..!!!

బీడ్ (మహారాష్ట్ర): ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను ఓ భార్య అత్యంత కిరాతకంగా హత్య చేయించిన ఉదంతాన్ని పోలీసులు ఛేదించారు. హత్య చేసిన తర్వాత అది రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు నిందితులు మృతదేహాన్ని రోడ్డుపై పడేసి పరారయ్యారు.

బీడ్ జిల్లా నెక్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింబా గణేష్ ప్రాంతంలో జరిగిన కిరణ్ సోనవణే హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు బట్టబయలు చేశారు. మొదట్లో రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ కేసు.. పోలీసుల లోతైన విచారణలో వివాహేతర సంబంధం కారణంగా జరిగిన పక్కా స్కెచ్ మర్డర్ అని తేలింది. ఈ కేసులో మృతుడి భార్య ప్రియాంక సోనవణే, ఆమె ప్రియుడు దాశరథ్ పరదేశి, అతని స్నేహితుడు ధీరజ్ యేడేలను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

యాక్సిడెంట్‌గా చిత్రీకరించే కుట్ర:
గత మే 31న రోడ్డు పక్కన మోటార్ సైకిల్‌తో పాటు కిరణ్ సోనవణే మృతదేహం లభ్యమైంది. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు కొన్ని అనుమానాస్పద ఆధారాలు దొరకడంతో కేసును సీరియస్‌గా తీసుకున్నారు. విచారణలో భార్య ప్రియాంకనే అసలు సూత్రధారి అని తేలింది. ఘటన జరిగిన రోజు రాత్రి భర్త కిరణ్‌ను చికెన్ రైస్ తీసుకురావాలనే నెపంతో ఆమె ఇంటి నుండి బయటకు పంపింది. ఆ వెంటనే ఈ సమాచారాన్ని తన ప్రియుడు దాశరథ్ పరదేశికి చేరవేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్లాన్ ప్రకారం రహదారిపై వేచి ఉన్న దాశరథ్ పరదేశి తన స్నేహితుడు ధీరజ్‌తో కలిసి కిరణ్ సోనవణేను అడ్డుకుని గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత శవంపై మోటార్ సైకిల్ పడేసి, అది రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. హత్య పూర్తయిన వెంటనే ప్రియుడు దాశరథ్.. ప్రియాంకకు ఫోన్ చేసి “కార్యక్రమం ఓకే” (పని పూర్తయింది) అంటూ కోడ్ లాంగ్వేజ్‌లో సమాచారం అందించాడు.

హత్య తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో 5 గంటల ముచ్చట్లు!
భర్తను చంపిన తర్వాత కూడా భార్య ప్రియాంక, ప్రియుడు దాశరథ్‌లు ఇన్‌స్టాగ్రామ్ కాల్ (Instagram Call) ద్వారా సుమారు 4 నుండి 5 గంటల పాటు మాట్లాడుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు నిందితుల మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా అకౌంట్ల నుండి కీలకమైన డిజిటల్ ఆధారాలను సేకరించారు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. వివాహేతర సంబంధంతో పాటు, భర్త కిరణ్ ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి తనను వేధించడం వల్లే అతడిని వదిలించుకోవాలని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రియాంక పోలీసుల ఎదుట ఒప్పుకుంది.


Posted

in

by

Tags: