ఇన్‌స్టా నుండి యూట్యూబ్ వరకు అన్నింటికీ బ్రేక్..! 16 ఏళ్ల లోపు పిల్లలకు బ్రిటన్ ప్రభుత్వం షాక్..!!

లండన్: చిన్నారుల మానసిక ఆరోగ్యం, ఆన్‌లైన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించింది.

ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా దేశాల తర్వాత ఈ తరహా కఠినమైన చట్టాన్ని అమలు చేస్తున్న నాలుగో దేశంగా బ్రిటన్ నిలిచింది.

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో సోషల్ మీడియా భాగమైపోయింది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి కళ్లు మూసే వరకు అంతా సోషల్ మీడియాలోనే గడుస్తోంది. అయితే, ఇది చిన్నారుల మానసిక ఎదుగుదలను తీవ్రంగా దెబ్బతీస్తోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు అంతర్జాతీయ దేశాలు సోషల్ మీడియా వినియోగంపై రకరకాల ఆంక్షలను విధిస్తున్నాయి. భారతదేశం కూడా మైనర్ల సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించే అంశంపై అంతర్గతంగా సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే బ్రిటన్ ఈ భారీ నిషేధాన్ని ప్రకటించింది.

పిల్లల బాల్యాన్ని వారికే తిరిగి ఇస్తాం: బ్రిటన్ ప్రధాని
ఈ చట్టాన్ని ప్రకటించిన బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ మాట్లాడుతూ.. పిల్లల నుండి దూరం అవుతున్న వారి ‘బాల్యాన్ని’ వారికే తిరిగి అప్పగించడమే తమ ప్రభుత్వ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. “మేము 16 ఏళ్ల లోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని విధిస్తున్నాం. నేటి కాలంలో టెక్నాలజీ పిల్లల జీవితాల్లోని ప్రతి భాగంలోనూ చొరబడింది. ఇది వారి సహజమైన ఎదుగుదలను దెబ్బతీస్తోంది. దీన్ని ఇక ఎంతమాత్రం అనుమతించలేం” అని ఆయన పేర్కొన్నారు.

తీసుకోనున్న కఠిన చర్యలు:
బ్రిటన్ ప్రభుత్వం ఈ ప్రణాళికను ‘ఆస్ట్రేలియా-ప్లస్’ (Australia-Plus approach) విధానంగా పిలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఇప్పటికే అమలులో ఉన్న చట్టాల కంటే మరింత కఠినమైన నిబంధనలను బ్రిటన్ తీసుకురానుంది. దీని ప్రకారం:

సురక్షితమైనవిగా భావించే ప్లాట్‌ఫారమ్‌లలో కూడా లైవ్ స్ట్రీమింగ్ (నేరలా ప్రసారాలు) పై తీవ్ర ఆంక్షలు ఉంటాయి.

ఆన్‌లైన్ గేమింగ్ సమయంలో అపరిచిత వ్యక్తులతో పిల్లలు చాటింగ్ చేయడం లేదా కమ్యూనికేట్ చేయడాన్ని పూర్తిగా నిరోధిస్తారు.

నిర్దేశిత సమయం దాటిన తర్వాత (నైట్ కర్ఫ్యూ తరహాలో) పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఉండేలా కొత్త సాంకేతిక విధానాన్ని తీసుకురావాలని బ్రిటన్ యోచిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే నెలలో విడుదల కానున్నాయి.

ఏయే యాప్స్‌పై నిషేధం పడనుంది?
ఆస్ట్రేలియా తరహాలోనే బ్రిటన్ కూడా ప్రధానంగా ఈ కింది 10 ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

టిక్‌టాక్, స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, రెడ్డిట్, ట్విచ్, ఎక్స్ (ట్విట్టర్), త్రెడ్స్, ఫేస్‌బుక్ మరియు కిక్ (Kick).

వీటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత చాట్‌బాట్‌లను పిల్లలు ఉపయోగించడంపై కూడా కొన్ని పరిమితులు విధించనున్నారు.

90 శాతం తల్లిదండ్రుల మద్దతు:
ఈ నిషేధాన్ని చట్టంగా మార్చడానికి ముందు బ్రిటన్ ప్రభుత్వం మూడు నెలల పాటు ప్రజల నుండి అభిప్రాయ సేకరణ (Public Opinion Poll) చేపట్టింది. ఇందులో సుమారు 1,16,000 మంది పాల్గొన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న తల్లిదండ్రులలో 90 శాతం మంది ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించారు. అలాగే 83 శాతం మంది సోషల్ మీడియా వల్ల పిల్లలకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతోందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

“ఈ కాలంలో పిల్లల భద్రత అనేది అత్యంత కీలకమైన అంశం. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు సురక్షితంగా, సంతోషంగా పెరగాలని కోరుకుంటారు. పాత పద్ధతినే కొనసాగించాలా లేదా కుటుంబాలకు అండగా నిలబడాలా అనే ప్రశ్న వచ్చినప్పుడు, మా ప్రభుత్వం ఖచ్చితంగా కుటుంబాల పక్షాన నిలబడడానికే మొగ్గు చూపింది” అని ప్రధాని స్టార్మర్ ముగించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *