న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తో పాటు ఇతర బ్యాంకుల పనితీరుపై సుప్రీంకోర్టు అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. సామాన్య ప్రజలకు చిన్నపాటి రుణాలు (లోన్లు) ఇచ్చే పేరుతో బ్యాంకులు వారిని ‘వేధింపులకు’ గురిచేస్తున్నాయని, అదే సమయంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ కంపెనీలకు మాత్రం ఎలాంటి ముందూవెనుకా ఆలోచించకుండా వేల కోట్లు ధారాదత్తం చేస్తున్నాయని, ఆ రుణాలు ఆ తర్వాత మొండి బకాయిలుగా (మునిగిపోయే లోన్లుగా) మారుతున్నాయని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం బ్యాంకింగ్ రంగంలో కనిపిస్తున్న ఒక ఆందోళనకరమైన ధోరణిని ఎత్తిచూపింది. సామాన్య మానవుడు తన వ్యక్తిగత అవసరాల కోసం చిన్న లోన్ తీసుకోవాలంటే ముక్కు తిప్పలు పడాల్సి వస్తోందని, కానీ పెద్ద పెద్ద లోన్లను మాత్రం ఎలాంటి సరైన తనిఖీలు, దర్యాప్తు లేకుండానే క్షణాల్లో పాస్ చేస్తున్నారని ధర్మాసనం మండిపడింది.
రూ.8 కోట్ల లోన్ తీసుకుని.. ఒక్క కిస్తు కూడా కట్టలేదు!
ఈ వివాదం హర్యానాకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించింది. ఆ కంపెనీ 2019లో ఎస్‌బీఐ నుంచి రూ.8.09 కోట్ల రుణం తీసుకుంది. లోన్ అమౌంట్ అకౌంట్లో పడగానే.. ఆ కంపెనీ కనీసం ఒక్క ఈఎంఐ (కిస్తు) కూడా తిరిగి చెల్లించలేదు. దాంతో కేవలం కొన్ని నెలల్లోనే ఆ లోన్ ఖాతాను బ్యాంక్ ఎన్‌పీఏ (NPA – మొండి బకాయి) గా ప్రకటించింది.
ఇలా జరిగిన 6 సంవత్సరాల తర్వాత.. ఇప్పుడు ఆ కంపెనీ కోర్టును ఆశ్రయించి, తాను కేవలం అసలు మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తానని పిటిషన్ వేసింది. కంపెనీ చేసిన ఈ డిమాండ్‌ను “చాలా తక్కువ, చాలా ఆలస్యంగా వచ్చిన ప్రతిపాదన” అని పేర్కొంటూ సుప్రీంకోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆ కంపెనీకి చెందిన ఆస్తులను జప్తు చేసుకునేందుకు బ్యాంకుకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అయితే, అదే సమయంలో లోన్ ఇచ్చిన బ్యాంక్ అధికారులను కూడా కోర్టు కటకటా నిలబెట్టింది.
‘సామాన్యుడికి ప్రక్రియ సులభంగా, పారదర్శకంగా ఉండాలి’
ఈ సంచలన వ్యాఖ్యల అనంతరం అత్యున్నత న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో కీలక అంశాలను పొందుపరిచింది. ఎస్‌బీఐతో సహా అన్ని బ్యాంకులు పెద్ద కంపెనీలకు భారీ మొత్తంలో రుణాలు ఇచ్చేటప్పుడు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయనే విషయం కోర్టు దృష్టికి వస్తోందని తెలిపింది.
దీనికి భిన్నంగా, ఒక సామాన్య మానవుడు తన వ్యక్తిగత అత్యవసరాల కోసం చిన్న లోన్ కోసం వస్తే.. అతని ముందు కఠినమైన నిబంధనలు, అలసట కలిగించే సుదీర్ఘమైన ప్రక్రియను ఉంచుతున్నారని, ఇది చాలా సందర్భాలలో వేధింపులకు సమానంగా మారుతోందని కోర్టు అభిప్రాయపడింది.
రుణాల రికవరీ మానవీయంగా ఉండాలి:
తాము బ్యాంకు నిబంధనలను సడలించమని చెప్పడం లేదని, అయితే రుణాలు ఇవ్వడం మరియు వాటిని తిరిగి వసూలు చేసే (రికవరీ) ప్రక్రియ సరళంగా, పారదర్శకంగా మరియు మానవీయంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (పేద, మధ్యతరగతి) ప్రజలకు దీని వల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరాలని పేర్కొంది.
ఎస్‌బీఐ అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నలు:
ఈ వ్యవహారంలో ఎస్‌బీఐ మరియు దాని ఉన్నతాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. లోన్ తీసుకున్న వెంటనే సదరు కంపెనీ డిఫాల్ట్ అవ్వడం (చేతులెత్తేయడం) చూస్తుంటే.. లోన్ పాస్ చేయడానికి ముందు ఆ కంపెనీకి అసలు రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందో లేదో బ్యాంక్ అధికారులు కనీసం తనిఖీ కూడా చేయలేదని అర్థమవుతోందని పేర్కొంది.
ఈ తీవ్రమైన ఆందోళనను, కోర్టు అభిప్రాయాన్ని బ్యాంక్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఎస్‌బీఐ తరఫున హాజరైన అడిషనల్ సాలిసిటర్ జనరల్ అర్చనా పాఠక్ దవేను కోర్టు ఆదేశించింది. ప్రస్తుతానికి ఈ కేసులో బ్యాంకులపై ఎలాంటి కొత్త నిబంధనలు లేదా ప్రత్యక్ష ఉత్తర్వులు జారీ చేయడం లేదని, కానీ భవిష్యత్తులో మరేదైనా కేసులో బ్యాంకుల ఇటువంటి నిర్లక్ష్య వైఖరి బయటపడితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

Leave a Reply