గుండెల్లో ధైర్యం, ఆత్మగౌరవం బతికే ఉంటే.. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమేనని అంటుంటారు. ముంబై వీధుల్లో ప్రతిరోజూ 12 గంటల పాటు చెమట చిందిస్తున్న 82 ఏళ్ల మన్‌సుఖ్ కాకా (Mansukh Kaka) ఈ మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.
సాధారణంగా ఈ వయసులో మనుషులు సరిగ్గా నడవలేరు. కానీ, అలాంటి వయసులో కూడా మన్‌సుఖ్ కాకా తన ఆత్మగౌరవంతో కుటుంబ పొట్ట నింపుతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూసి లక్షలాది మంది నెటిజన్ల కళ్లు చెమర్చుతున్నాయి.
హృదయాన్ని కదిలించే ఈ కథనాన్ని ముంబైకి చెందిన కంటెంట్ క్రియేటర్ ఆరాధనా ఛటర్జీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఒకరోజు ఆమె రోడ్డుపై వెళ్తుండగా.. ఒక వృద్ధుడు ఎంతో పద్ధతిగా తన చిన్న దుకాణాన్ని సర్దుకుంటూ కనిపించారని ఆమె తెలిపారు. ఆరాధన ఆయనతో మాట్లాడినప్పుడు బయటపడిన కథ.. అందరి హృదయాలను పిండేసింది.
కరోనా కాలంలో ఊడిన ఉద్యోగం
మన్‌సుఖ్ కాకా గతంలో చాలా ఏళ్ల పాటు ఒక చీరల దుకాణంలో సేల్స్‌మ్యాన్‌గా పనిచేసేవారు. జీవితం సాఫీగానే సాగిపోతున్న సమయంలో.. కోవిడ్ మహమ్మారి వల్ల ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ఆయన ఉద్యోగం ఊడిపోయింది. పరిస్థితులు ఎంత దారుణంగా మారాయంటే.. అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసుకోవడం కోసం ఆయన కుమారుడు కూడా తన ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది.
ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మన్‌సుఖ్ కాకా ఓటమిని అంగీకరించలేదు. ఎవరి ముందూ చేయి చాచకుండా.. మళ్లీ తన కాళ్లపై తాను నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఇంటి దగ్గరే ఒక చిన్న స్టాల్ (బండి) ఏర్పాటు చేసుకున్నారు. ఆయన చిన్న నెట్టుడు బండిపై ఖాఖ్రా, చక్లీ, ఫర్సాన్ వంటి దాదాపు 20 రకాల హోమ్‌మేడ్ స్నాక్స్ (ఇంట్లో చేసిన పిండివంటలు) లభిస్తాయి. విశేషం ఏమిటంటే.. ఈ స్నాక్స్ అన్నింటినీ కాకా సోదరి ఇంట్లోనే ఎంతో ప్రేమగా తయారు చేస్తారు.
కష్టం ఎక్కువ.. సంపాదన తక్కువ
ఉదయం నుంచి రాత్రి దాదాపు 12 గంటల వరకు బండి దగ్గరే కూర్చున్నా.. మన్‌సుఖ్ కాకాకు వచ్చే నికర సంపాదన కేవలం రూ. 300 ఆరితేరినట్లే. వైరల్ వీడియోలో ఆయన తన చిన్నపాటి సంపాదనను, పైపైసా లెక్కను ఒక డైరీలో రాసుకుంటూ కనిపించారు.
ఈ వీడియోలో ప్రజలను ఆకర్షించింది కేవలం ఆయన పేదరికం మాత్రమే కాదు.. ఆయనలోని క్రమశిక్షణ, పద్ధతి కూడా. 82 ఏళ్ల వయసులో రోడ్డుపై బండి నడుపుతున్నప్పటికీ.. మన్‌సుఖ్ కాకా ఎప్పుడూ నీట్‌గా ఉతికిన షర్టులోనే కనిపిస్తారు. అంతేకాదు, కస్టమర్లతో ఆయన మాట్లాడే విధానం, ఆయనలోని వినయం ఎవరినైనా ముగ్ధులను చేస్తుంది.
ఆత్మగౌరవాన్ని కాపాడదాం – నెటిజన్ల అప్పీల్
ఈ వీడియోను షేర్ చేస్తూ ఆరాధన ప్రజలకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ముంబైలోని ఆ ప్రాంతం గుండా ఎవరైనా వెళ్తే.. ఖచ్చితంగా మన్‌సుఖ్ భాయ్ స్టాల్ నుండి స్నాక్స్ కొనాలని ఆమె కోరారు. “ఎవరైనా నిరుపేదకు సహాయం చేయడానికి ఉత్తమమైన మార్గం వారికి డబ్బులు దానం చేయడం కాదు.. వారి నైపుణ్యాన్ని, శ్రమను గౌరవించి వస్తువులు కొనడం. తద్వారా వారి ఆత్మగౌరవం ఎల్లప్పుడూ సమున్నతంగా ఉంటుంది” అని ఆమె పేర్కొన్నారు. ఈ స్ఫూర్తిదాయక వీడియో ప్రస్తుతం అంతర్జాలంలో హల్‌చల్ చేస్తోంది.

Leave a Reply