భార్యను గుడికి తీసుకెళ్లి.. ప్రసాదంలో విషం కలిపి తాగించిన భర్త! మర్డర్ మిస్టరీ వీడిందిలా..

బెళగావి: పరాయి మహిళ కోసం ఒక భర్త తన అమాయక భార్యను వదిలించుకోవాలని కుట్ర పన్నాడు. అత్యంత దారుణంగా ఆమెను హతమార్చాడు. గుండెల్ని పిండేసే ఈ ఘోర సంఘటన కర్ణాటకలోని బెళగావి (బెల్గాం) జిల్లాలో చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన భర్త సంతోష్‌ను భార్యను హత్య చేసిన ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ భయంకరమైన హత్యోదంతం వెనుక ఉన్న అసలు కుట్ర ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. సంతోష్ పటాయాత్‌కు తొమ్మిదేళ్ల క్రితం గోకాక్ తాలూకా షిండికురాబెట్ గ్రామానికి చెందిన సక్కుబాయితో వివాహం జరిగింది. అయితే, గత నాలుగేళ్లుగా సంతోష్ మరొక మహిళతో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. తన బంధానికి అడ్డు వస్తోందని భావించి భార్యను శాశ్వతంగా దారి నుంచి తప్పించేందుకు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

గుడికి తీసుకెళ్లి స్కెచ్ అమలు..
ఒకరోజు సంతోష్ తన భార్యతో.. “ప్రస్తుతం అధిక మాసం నడుస్తోంది, మనం బైలహోంగల్ తాలూకా మార్కుంబి గ్రామంలోని చాముండేశ్వరి అమ్మవారి గుడికి వెళ్దాం” అని చెప్పాడు. భర్త మాటలు నమ్మిన భార్య ఆలయానికి వెళ్లడానికి సిద్ధమైంది. సంతోష్ మొదట భార్య సక్కుబాయిని గుడికి తీసుకెళ్లి దర్శనం చేయించాడు.

అక్కడి నుండి తిరిగి వస్తుండగా, దారిలో ఆమెకు ‘అమ్మవారి ప్రసాదం’ అంటూ జ్యూస్ తాగించాడు. నిజానికి ఆ జ్యూస్‌లో అతడు ముందే ఎలుకల మందు కలిపాడు. ఆ జ్యూస్ తాగిన వెంటనే సక్కుబాయి స్పృహతప్పి పడిపోయింది. ఆ తర్వాత ఆమెను రోడ్డు పక్కన ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి గొంతు పిసికి దారుణంగా చంపేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి, తన భార్య రోడ్డు ప్రమాదానికి (యాక్సిడెంట్) గురై మరణించిందని నమ్మబలికాడు.

రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ..
తన వివాహేతర బంధానికి భార్య అడ్డుపడుతోందనే ఏకైక కారణంతోనే సంతోష్ ఈ హత్య చేశాడు. తన గ్రామానికి చెందిన ఒక వితంతువుతో (విధ్వా మహిళ) అతనికి గత నాలుగేళ్లుగా అక్రమ సంబంధం ఉంది. ఈ దారుణాన్ని కప్పిపుచ్చి, దీన్ని ఒక రోడ్డు ప్రమాదంగా చూపించడానికి అతడు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ, పాపం పండి చివరికి పోలీసుల చేతికి చిక్కాడు.

పోస్టుమార్టం రిపోర్టుతో తేలిన నిజం!
సక్కుబాయి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు.. భర్త సంతోష్ చెప్పిన ప్రమాదం కథపై అనుమానం వచ్చింది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ‘బెళగావి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’కు తరలించారు. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో.. అది ప్రమాదం వల్ల జరిగిన మరణం కాదని, గొంతు పిసికి హత్య చేశారని తేలింది.

రిపోర్ట్ రాగానే పోలీసుల అనుమానం కాస్తా నిజమైంది. సంతోష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో గట్టిగా విచారించగా, అతడు తన నేరాన్ని అంగీకరించాడు. ప్రియురాలితో కలిసి జీవించడానికే భార్యను దారి నుండి తప్పించడానికి ఈ ప్లాన్ వేసినట్లు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు ఈ దారుణ హత్యలో ఆ వితంతువు పాత్ర ఎంతవరకు ఉందనే కోణంలో కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *