బెంగళూరు: తల్లిదండ్రుల ప్రతిఘటనను, ఎదిరింపులను పక్కనబెట్టి, ప్రేమించిన వాడే సర్వస్వమని నమ్మి చేయి పట్టిన ఒక యువతిని.. అదే భర్త చెరువు గట్టుపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘోర సంఘటన కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది.
ప్రేమ వివాహం.. ఆపై కలహాలు:
బెంగళూరు శివారు ప్రాంతమైన ఆవలహళ్లికి చెందిన గణేష్, చిక్కబళ్లాపూర్ జిల్లా చింతామణికి చెందిన యోగిని (21) అనే యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇరువైపులా తల్లిదండ్రులు వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, ప్రేమే ముఖ్యమంటూ ఇద్దరూ ఇళ్లను వదిలి బయటకు వచ్చి వివాహం చేసుకున్నారు.
పెళ్లి తర్వాత ఈ యువ జంట కోలార్ జిల్లా మాలూరు ప్రాంతంలో ఒక అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. ప్రారంభంలో వీరి సంసారం సాఫీగానే సాగినప్పటికీ, కొన్ని నెలల్లోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు, కుటుంబ గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవల సమయంలో గణేష్.. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అని కూడా చూడకుండా యోగినిని దారుణంగా కొడుతూ, హింసించేవాడు. భర్త నిరంతర వేధింపులను భరించలేక మనస్తాపానికి గురైన యోగిని, గత వారం రోజుల క్రితం భర్తతో గొడవపడి తన తల్లి కల్పన ఇంటికి వచ్చేసింది.
ఇంటర్వ్యూ నెపంతో వచ్చి ఘాతుకం:
తల్లి ఇంటికి వెళ్లిన భార్యను తనతో కాపురానికి రావాలని గణేష్ స్వయంగా వెళ్లి, అలాగే ఫోన్ ద్వారా కూడా బతిమిలాడాడు. కానీ, భర్త కొట్టే దెబ్బలకు మళ్లీ బలవ్వడం ఇష్టం లేని యోగిని అతనితో వెళ్లడానికి నిరాకరించింది. తన కాళ్లపై తాను నిలబడాలనే పట్టుదలతో ఆమె ఉద్యోగం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో మాలూరు నరసాపుర పారిశ్రామిక ప్రాంతంలోని (ఇండస్ట్రియల్ ఎస్టేట్) ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ ఇంటర్వ్యూ జరుగుతున్నట్లు తెలుసుకుని, ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో ఆమె అక్కడికి వెళ్ళింది.
ఈ విషయం తెలుసుకున్న భర్త గణేష్, ఆమె ఇంటర్వ్యూకి వచ్చిన ప్రదేశానికే వెెళ్లాడు. అక్కడ ఆమెతో మాట్లాడుతూ.. గొడవలన్నీ సర్దుబాటు చేసుకుందామని నమ్మించి, సమీపంలో ఉన్న మీండహళ్లి చెరువు గట్టుకు యోగినిని తీసుకువెళ్లాడు.
“నీ కూతురిని చంపేశా” అంటూ అత్తకు ఫోన్:
చెరువు గట్టుపై ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో మళ్లీ వారి మధ్య వివాహం ముదిరింది. దీనితో తీవ్ర ఆగ్రహానికి లోనైన గణేష్, తను రహస్యంగా దాచి ఉంచిన కత్తిని తీసి యోగినిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన యోగిని రక్తపు మడుగులో అక్కడికక్కడే విగతజీవిగా పడిపోయింది.
హత్య చేసిన తర్వాత గణేష్ అక్కడ నుండి పారిపోకుండా, నేరుగా తన అత్తకు ఫోన్ చేసి, “నీ కూతురిని చంపేశాను” అంటూ నిర్లక్ష్యంగా, అహంకారంతో చెప్పాడు. ఆ మాటలకు షాకైన తల్లి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న వెంటనే మాలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యోగిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడే నిలబడి ఉన్న కిరాతక భర్త గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
