19 ఏళ్ల క్రితం జార్ఖండ్ ఎంపీని చంపి, శవం ఛాతీపైకెక్కి నాట్యం చేసిన ‘పుష్ప’.. ఎట్టకేలకు లొంగుబాటు!

జంషెడ్‌పూర్: జంషెడ్‌పూర్ అప్పటి ఎంపీ సునీల్ మహతోను దారుణంగా హత్య చేసి, ఆయన మృతదేహం ఛాతీపై నిలబడి తమ ఆపరేషన్ విజయవంతమైందంటూ సంబరాలు చేసుకున్న మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్ట్ శకుంతలా మహతో అలియాస్ పుష్ప ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయింది.

గత 25 సంవత్సరాలుగా పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ భీకర మహిళా కమాండర్‌ తలపై ప్రభుత్వం రూ. 10 లక్షల రివార్డు ప్రకటించింది. జూన్ 17న కోల్‌కతాలోని లాల్‌బజార్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈమె ఆయుధాలతో సహా ఆత్మసమర్పణ చేసుకుంది.

ఛాతీపై నిలబడి భీకరంగా సంబరాలు:
మార్చి 4, 2007 నాటి రోజు ఘాట్‌శిలా ప్రాంతానికి ఒక చీకటి రోజు. బాఘుడియా ఫుట్‌బాల్ మైదానంలో నక్సలైట్లు అప్పటి ఎంపీ సునీల్ మహతోతో సహా నలుగురిని కాల్చిచంపారు. ఈ దాడిలో శకుంతల కేవలం విచక్షణారహితంగా కాల్పులు జరపడమే కాకుండా, క్రూరత్వానికి పరాకాష్టగా.. రక్తపు మడుగులో ఉన్న ఎంపీ శవం ఛాతీపై నిలబడి భీకరంగా నృత్యం చేస్తూ విజయోత్సవం జరుపుకుంది.

ఈ ఘోర హత్యాకాండ జరిగినప్పటి నుండి సిబిఐ (CBI) ఆమె కోసం తీవ్రంగా గాలిస్తోంది. ఈ క్రమంలోనే జార్ఖండ్ ప్రభుత్వం ఆమెపై రూ. 10 లక్షల బహుమతిని ప్రకటించింది.

10 ఏళ్ల వయసులోనే నక్సల్స్ సంస్థలోకి..
పశ్చిమ బెంగాల్‌లోని ఝార్గ్రామ్ జిల్లా బెల్‌పహాడి పరిధిలోని మేచువా గ్రామానికి చెందిన శకుంతల, కేవలం 10 సంవత్సరాల వయస్సులోనే మావోయిస్ట్ పార్టీలోకి చేరింది. ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఈమె.. సంస్థలో ‘పరి’, ‘వర్ష’ వంటి మారుపేర్లతో దశాబ్దాల పాటు ఉగ్రరూపం ప్రదర్శించింది.

ఆ తర్వాత 2003లో ఈమెకు ఝార్గ్రామ్ స్క్వాడ్ ఏరియా కమాండర్ అతుల్ మహతోతో పరిచయం ఏర్పడింది. 2005లో రాంచీలోని తమాడ్ అటవీ ప్రాంతంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

టాప్ లీడర్ కిషన్‌జీకి అత్యంత ఆప్తురాలు:
శకుంతల మావోయిస్ట్ పార్టీకి చెందిన ఈస్టర్న్ రీజినల్ బ్యూరో మరియు జోనల్ కమిటీలో కీలక సభ్యురాలిగా పనిచేసింది. అప్పట్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత కిషన్‌జీ (కోటేశ్వరరావు)కి ఆమె అత్యంత ఆప్తురాలిగా ఉండేది. ప్రస్తుతం ఒక కోటి రూపాయల రివార్డు ఉన్న అగ్రనేత అసీమ్ మండల్‌కు అత్యంత నమ్మకమైన కుడిభుజంగా ఆమె వ్యవహరిస్తోంది.

తూర్పు సింగ్‌భూమ్‌లోని గాలుడీహ్, ధాల్‌భూమ్‌గఢ్, పటమ్దా, బోడామ్ పోలీస్ స్టేషన్లలో ఆమెపై పలు తీవ్రమైన నక్సల్ హింసాత్మక కేసులు నమోదయ్యాయి. జార్ఖండ్, ఒడిశా, బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన పలు భారీ దాడుల్లో ఈమె ప్రధాన పాత్ర పోషించింది.

46 రౌండ్ల బుల్లెట్లు, అత్యాధునిక ఆయుధాలతో లొంగుబాటు:
కిషన్‌జీ ఎన్‌కౌంటర్ తర్వాత సంస్థ బాధ్యతలు చేపట్టిన రంజిత్ పాల్, అతని భార్య ఝర్నా కూడా 2017 లోనే పోలీసులకు లొంగిపోయారు. ఇప్పుడు శకుంతల కూడా 46 రౌండ్ల లైవ్ బుల్లెట్లు, అత్యాధునిక ఆయుధాలతో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసింది.

ఈమె లొంగుబాటుతో.. రూ. 15 లక్షల రివార్డు ఉన్న రాందాస్ మార్డీ, మాలతీ ముర్ము (రూ. 5 లక్షలు), మీనా (రూ. 2 లక్షలు), బేలా, సమీర్ మహతో వంటి ఆమె సహచర మావోయిస్టుల నెట్‌వర్క్‌కు కోలుకోలేని దెబ్బ తగిలిందని పోలీసులు భావిస్తున్నారు.


Posted

in

by

Tags: