జనసంచారం లేని వీధుల్లో 100 లేదా 500 రూపాయల నోట్లను పడేసి, వాటిని తీసుకునేలా చేసి.. ఆపై వారిని స్పృహతప్పేలా చేసి దోచుకునే సరికొత్త తరహా నేరాలపై (న్యూ స్టైల్ క్రైమ్స్) ఒక పోలీస్ అధికారి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో చేసిన హెచ్చరిక ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
రసాయన నోట్లతో సరికొత్త మోసం – పోలీసుల అలర్ట్:
‘cop_mohit_gurjar’ అనే సోషల్ మీడియా ఖాతా ద్వారా సదరు పోలీస్ అధికారి పంచుకున్న ఆ వీడియోలో ఇలా పేర్కొన్నారు.. “రోడ్డుపై ఒంటరిగా పడి ఉన్న కరెన్సీ నోట్లను చూసిన వెంటనే, ముఖ్యంగా మహిళలు వాటిని తాకడం లేదా తీసుకునే పొరపాటు అస్సలు చేయవద్దు.
ఆ నోట్లకు ఒక రకమైన జిగట రసాయనాన్ని (కెమికల్ను) రాసి ఉంచుతారు. ఆ నోటును చేతిలోకి తీసుకోగానే ఆ రసాయన వాసన వల్ల మీరు అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయే ప్రమాదం ఉంది. మీరు అలా పడిపోగానే.. ఆ సమయంలో సమీపంలోనే పొంచి ఉన్న దుండగులు మీ వద్ద ఉన్న నగదు, నగలను దోచుకోవడమే కాకుండా, మీపై మరింత ఘోరమైన నేరాలకు ఒడిగట్టే అవకాశం ఉంది” అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
ఈ వినూత్న తరహా దోపిడీ విధానంపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, రోడ్లపై పడి ఉండే డబ్బు ఆశకు దూరంగా ఉండాలని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు కూడా ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు.
