న్యూఢిల్లీ: ఢిల్లీలో ఒక మహిళకు ఎన్నో ఏళ్ల తర్వాత తన స్కూల్ స్నేహితులను కలుసుకుని చేసుకున్న రీ-యూనియన్ పార్టీ.. జీవితంలో మర్చిపోలేని ఒక పెద్ద శిక్షగా మారింది. పార్టీ ముగిసిన తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్‌లో అందరూ తమ ఫోటోలను షేర్ చేసుకోగా.. ఆ స్నేహితులలో ఒకరు సదరు మహిళ ఫోటోను దొంగిలించి, దాన్ని మార్ఫింగ్ చేసి ఒక అశ్లీల వీడియోను తయారు చేశారు.
అంతేకాకుండా, ఆ వీడియోను వాట్సాప్‌లో వైరల్ కూడా చేశారు. ప్రస్తుతం బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా వెస్ట్ డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు.
నమ్మినవారే నట్టేట ముంచారు:
పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం.. రాజౌరి గార్డెన్ ప్రాంతంలో నివసిస్తున్న 39 సంవత్సరాల మహిళ తన ఫిర్యాదులో సంచలన విషయాలను వెల్లడించింది. కొన్ని నెలల క్రితం ఆమె పాత స్కూల్ స్నేహితులందరూ కలిసి వాట్సాప్‌లో ఒక రీ-యూనియన్ గ్రూప్‌ను క్రియేట్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే గత మార్చి 1వ తేదీన స్నేహితులందరూ ఒక రీ-యూనియన్ పార్టీలో కలుసుకున్నారు. పార్టీ ముగిశాక దానికి సంబంధించిన అనేక ఫోటోలను ఆ వాట్సాప్ గ్రూప్‌లో పంచుకున్నారు. అయితే, ఆ ఫోటోల నుండి సదరు మహిళ ఫోటోను తీసుకుని, ఒక గుర్తుతెలియని నంబర్ ద్వారా 7 సెకన్ల నిడివి గల అత్యంత అభ్యంతరకరమైన, నకిలీ (మార్ఫింగ్) వీడియో క్లిప్‌ను తయారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
గుర్తుతెలియని నంబర్‌తో అసభ్యకర గ్రూప్:
బాధితురాలి కథనం ప్రకారం.. మార్చి 18వ తేదీన ఆమె పాత స్కూల్ స్నేహితుడు ఒకరు ఫోన్ చేసి, ఈ అశ్లీల వీడియో వాట్సాప్‌లో వైరల్ అవుతున్నట్లు సమాచారం ఇచ్చాడు. దీనిపై మరింత ఆరా తీయగా.. నిందితులు కేవలం వీడియోను వైరల్ చేయడమే కాకుండా, ప్రత్యేకంగా 7-8 మందితో ఒక విడిగా వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసినట్లు తెలిసింది. కావాలనే ఆ గ్రూప్‌లో ఈ నకిలీ వీడియోను షేర్ చేస్తూ.. సదరు మహిళను మానసికంగా, సామాజికంగా వేధించడం ప్రారంభించారు. సమాజంలో బద్నాం అవుతామనే భయంతో బాధితురాలితో పాటు ఆమె కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది.
ఇద్దరు నిందితుల గుర్తింపు:
సైబర్ పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో.. ఏ గుర్తుతెలియని నంబర్ నుండి అయితే ఈ వీడియోను సర్క్యులేట్ చేశారో, ఆ నంబర్ సచిన్ తన్వర్ అనే వ్యక్తి పేరిట నమోదై ఉన్నట్లు తేలింది. చట్టపరమైన చర్యల నుండి తప్పించుకోవడానికి, తన గుర్తింపును దాచడానికి అతను ఆ నంబర్‌ను ఉపయోగించాడు.
దీనితో పాటు, ఈ మొత్తం కుట్రలో మరియు వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయడంలో సాహిల్ కపూర్ అనే మరో వ్యక్తి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ఇద్దరిపై కేసు నమోదు చేశారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేయడానికి, అలాగే ఇంటర్నెట్ మరియు వాట్సాప్ నుండి ఆ అభ్యంతరకరమైన కంటెంట్‌ను పూర్తిగా తొలగించడానికి పోలీసులు డిజిటల్ ఆధారాలను (Digital Evidence) సేకరిస్తున్నారు.
