“నడిరోడ్డుపై కేక్.. అర్ధరాత్రి వేళ హంగామా..!” పారిశ్రామికవేత్త భార్యకు చుక్కలు చూపించిన పోలీసులు..!!!

గువహాటి: అస్సాం రాష్ట్రం గువహాటి నగరంలోని ఒక రద్దీగా ఉండే ఫ్లైఓవర్ మధ్యలో, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ బారువా భార్య ‘హరబి’ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న తీరు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

హరబి తన స్నేహితురాళ్లు, అనుచరులతో కలిసి అర్ధరాత్రి వేళ కుమార్ భాస్కర్ వర్మ ఫ్లైఓవర్ మధ్యలో తమ లగ్జరీ కార్లను వరుసగా నిలిపివేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ, అక్కడ ఏకంగా రెడ్ కార్పెట్ (ఎరుపు రంగు తివాచీ) పరిచి మరీ కేక్ కట్ చేసి బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. సాధారణ ప్రజలకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగించేలా సాగిన ఈ పుట్టినరోజు వేడుకల వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో విడుదలై విపరీతంగా వైరల్ అయ్యాయి.

నెటిజన్ల ఆగ్రహం – రంగంలోకి దిగిన పోలీసులు:
బహిరంగ ప్రదేశంలో చట్టాన్ని అతిక్రమిస్తూ నిర్వహించిన ఈ వేడుకల వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చక్కర్లు కొట్టడంతో.. నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తూ దీనిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై తక్షణమే స్పందించిన గువహాటిలోని భరలుముఖ్ మరియు లతాసిల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది.. ప్రజలకు అంతరాయం కలిగించడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి పలు సెక్షన్ల కింద పారిశ్రామికవేత్త గౌతమ్ బారువాను అదుపులోకి తీసుకున్నారు.

14 మందిపై కేసులు నమోదు:
నడిరోడ్డుపై హంగామా సృష్టించిన ఆయన భార్య హరబితో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్న ఆమె మద్దతుదారులు, స్నేహితులు సహా మొత్తం 14 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి ప్రస్తుతం తీవ్రంగా విచారిస్తున్నారు. ఎంతటి సంపన్నులైనా చట్టం ముందు సమానమేనని నిరూపించిన పోలీసుల చర్యను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Posted

in

by

Tags: