పని ప్రదేశంలో ఒక ఉద్యోగి పనితీరు కేవలం వారి కష్టంపైనే ఆధారపడి ఉండదు; అక్కడ ఉండే పని వాతావరణం, ముఖ్యంగా మేనేజర్ ప్రవర్తన చాలా కీలక పాత్ర పోషిస్తాయి.
ఉద్యోగులు 24 గంటలూ పనికి సిద్ధంగా ఉండాలని ఆశించే ఒక విషపూరిత (Toxic) మేనేజర్ వేధింపుల గురించి, ఒక ఉద్యోగి ‘రెడిట్’ (Reddit) వేదికగా పంచుకున్న కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘Terrible-Mention-138’ అనే యూజర్ ఖాతా నుండి షేర్ చేసిన ఈ పోస్ట్‌లో, తాను ఏం చేస్తున్నానో మేనేజర్ నిరంతరం గమనిస్తూనే ఉంటారని, ఆఫీసు కాల్ మిస్ అయితే వెంటనే పర్సనల్ నంబర్‌కు ఫోన్ చేసి మానసిక వేధింపులకు గురిచేస్తారని ఆ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా, ప్రతిరోజూ రాత్రి 9:30 గంటలకు మేనేజర్ పెట్టే మీటింగ్ తన పాలిట నరకంగా మారిందని ఆయన పేర్కొన్నారు. కుటుంబంతో గడపాల్సిన ఆ సమయంలో ప్రతిరోజూ మీటింగ్ పెట్టే బదులు, వారంలో రెండు లేదా మూడు రోజులు మాత్రమే పెట్టమని కోరినా, మేనేజర్ ఆ అభ్యర్థనను తిరస్కరించారు. అంతటితో ఆగకుండా, ఆ ఉద్యోగి బాధ్యతలను విస్మరిస్తున్నారని, పనిని ఆలస్యం చేస్తున్నారని మేనేజర్ నిందలు వేశారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో, నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఉద్యోగానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సరైన సమతుల్యతను (Work-Life Balance) కాపాడుకోవడం ప్రతి ఉద్యోగి మానసిక ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
