బీజింగ్‌లోని 108 అంతస్తుల ‘సిటిక్ టవర్’ (CITIC Tower) భవనాన్ని చైనా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ‘సన్‌బర్డ్ ఎస్.ఏ 60ఎల్ అరోరా’ (Sunbird SA 60L Aurora) అనే చిన్న తరహా క్రీడా విమానం బలంగా ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది.
దేశంలోని అత్యున్నత భద్రతా వలయం ఉన్న, చైనా అధ్యక్షుడు మరియు ఇతర కీలక నాయకులు నివసించే ‘జోంగ్‌నాన్‌హై’ ప్రాంతానికి అత్యంత సమీపంలో ఈ ప్రమాదం జరగడం చైనా భద్రతా వ్యవస్థల సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేసింది. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే మరణించగా, భవనంలో ఉన్న మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. విమానం ఢీకొట్టిన వేగానికి భవనంలోని భారీ అద్దాలు పగిలి రోడ్లపై పడటం, విమాన శకలాలు చెల్లాచెదురుగా పడటంతో బీజింగ్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
అయితే, ఈ ఘోర ప్రమాదం కంటే ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం ఏమిటంటే.. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే చైనా ప్రభుత్వం చేపట్టిన ‘డిజిటల్ క్లీన్-అప్’. ప్రమాద స్థలంలో ఉన్న వందలాది మంది ప్రజలు తమ మొబైల్స్‌లో తీసిన వీడియోలు, ఫోటోలను ‘వీబో’, ‘వీచాట్’ వంటి సోషల్ మీడియా వేదికల్లో అప్‌లోడ్ చేసిన మరుక్షణమే, చైనా అధికారిక ఇంటర్నెట్ నియంత్రణ సంస్థ ‘సి.ఏ.సి’ (CAC) తన ‘గ్రేట్ ఫైర్‌వాల్’ టెక్నాలజీ ద్వారా వాటిని పూర్తిగా తుడిచిపెట్టేసింది.
“బీజింగ్ విమాన ప్రమాదం” అనే పదాలను కూడా ఎవరూ వెతకలేనంతగా చైనా నియంత్రణ చర్యలు చేపట్టింది. ప్రమాదం జరిగిన ఆనవాళ్లే లేకుండా చైనా నాటకం ఆడుతున్నప్పటికీ, 2011 రైలు ప్రమాదం నుండి 2022 చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ప్రమాదం వరకు.. నిజాలను, బ్లాక్ బాక్స్ నివేదికలను దాచిపెట్టే చైనా చీకటి చరిత్రను గుర్తుచేసుకుంటున్న అంతర్జాతీయ రాజకీయ, భద్రతా నిపుణులు, ఈ ప్రమాదం వెనుక ఏదో పెద్ద నిజాన్ని చైనా దాచిపెడుతోందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
