చెన్నై: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లోనే ప్రసవానికి ప్రయత్నించిన 32 ఏళ్ల మహిళ అధిక రక్తస్రావంతో మరణించిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని తిరుప్పూర్ సమీపంలోని తలవైపాళయంలో జరిగింది. మృతురాలిని శశికళగా గుర్తించారు.
ఈ నెల 24న ఈ ఘటన జరిగింది. శశికళ, కులందైసామి అనే రైతు భార్య. నార్మల్ డెలివరీ కావాలని ఆశించి, యూట్యూబ్‌లో సూచనలను పాటిస్తూ ఆమె ఇంట్లోనే ప్రసవించింది. ఆమెకు పండంటి మగబిడ్డ జన్మించాడు. అయితే, ప్రసవం తర్వాత శశికళ ఆరోగ్య పరిస్థితి విషమించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
పోలీసుల కథనం ప్రకారం, శశికళకు మొదటి కాన్పు సిజేరియన్ (సి-సెక్షన్) ద్వారా జరిగింది. ఆ తర్వాత ఆమెకు అల్లోపతి వైద్యంపై అయిష్టత ఏర్పడింది. మళ్లీ సిజేరియన్ చేయించుకోవడం ఇష్టం లేక, యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లోనే నార్మల్ డెలివరీకి ప్రయత్నించాలని కుటుంబం నిర్ణయించుకుంది. గర్భం దాల్చినప్పటి నుండి శశికళ ఒక్కసారి కూడా ఆసుపత్రికి వెళ్లలేదని పోలీసులు తెలిపారు.
భర్త, అత్త ఒత్తిడి వల్లే శశికళ ఇంట్లో ప్రసవించాల్సి వచ్చిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యుల నుండి ఎటువంటి ఫిర్యాదు అందకపోయినప్పటికీ, పోలీసులు స్వచ్ఛందంగా కేసు నమోదు చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్ చట్టంలోని సంబంధిత సెక్షన్లతో పాటు, ‘హత్యగా పరిగణించబడని నరహత్య’ (Culpable homicide not amounting to murder) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు శశికళ భర్త, అత్తలను విచారిస్తున్నారు.
