సోషల్ మీడియాలో మొదలైన ఒక ‘రొమాంటిక్ లవ్ స్టోరీ’ దారుణమైన హత్యతో ముగిసింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో, తను భార్యగా భావించి మూడు ఏళ్లుగా సహజీవనం చేసిన వ్యక్తి అసలు రూపం (మగవాడని) తెలియడంతో, ఒక 20 ఏళ్ల యువకుడు అతడిని రాళ్లతో కొట్టి చంపేశాడు.
రైల్వే ట్రాక్ వద్ద శవం: జూన్ 25న మస్కట్ ఫాటక్ రైల్వే గోడ సమీపంలో మహిళా దుస్తుల్లో ఉన్న ఒక మృతదేహం కుళ్ళిన స్థితిలో కనిపించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. మొదట ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం అనుకున్నా, పోస్ట్‌మార్టం నివేదికలో అది హత్య అని తేలడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు.
అసలేం జరిగింది? విచారణలో నిందితుడు పీయూష్ కుమార్ ఖర్వార్ను పోలీసులు అరెస్టు చేశారు. పీయూష్‌కు ఫేస్బుక్లో ‘నిషా కుమార్’ అనే ప్రొఫైల్‌తో పరిచయం ఏర్పడింది. అది నిజానికి ‘చందన్ కుమార్’ అనే యువకుడు సృష్టించిన ఫేక్ అకౌంట్. చందన్ తనను తాను అమ్మాయిగా నమ్మించి, పీయూష్‌తో ప్రేమలో దింపాడు. వీరి ప్రేమ ఎంతగా పెరిగిందంటే, పీయూష్ అతడిని తన భార్యగా భావించి నుదుట సింధూరం కూడా దిద్దాడు.
నిజం బయటపడటంతో.. చందన్ ఎప్పుడూ శారీరక సంబంధానికి దూరంగా ఉంటూ, మతపరమైన కారణాలు, ప్రమాణాలంటూ సాకులు చెప్పేవాడు. అయితే, ఒకరోజు చందన్ షేవింగ్ చేసుకోవడం పీయూష్ కంట పడటంతో, తాను ప్రేమిస్తున్నది మహిళను కాదని, ఒక మగవాడినని అతడికి అర్థమైంది. దీంతో పీయూష్ అతడిని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. కానీ, చందన్ వదలలేదు.
హత్య: జూన్ 21న పీయూష్ పనిచేస్తున్న ఫ్యాక్టరీ వద్ద వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన పీయూష్, చందన్‌ను రైల్వే ట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని దాచిపెట్టి, ఏమీ తెలియనట్లుగా తిరిగి ఫ్యాక్టరీకి వెళ్లి తన పనిలో చేరిపోయాడు.
