సోషల్ మీడియా: శ్రీలంకలోని పల్లెటూరి నేపథ్యంలో, వరి పొలాలు మరియు తాటి చెట్ల మధ్య ఒక చిన్నారి వన్యప్రాణులతో ఎటువంటి భయం లేకుండా ఎంతో సహజంగా ఆడుకుంటున్న వీడియో ఒకటి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కోట్లాది మంది మనసులను గెలుచుకుంటోంది.
ఆ వీడియోలో, సాధారణ దుస్తులు ధరించిన ఆ బాలిక పొలాల మధ్య నడుస్తుండగా, ఆమె వెనుక ఒక చిన్న ముళ్ళపంది (Porcupine) పెంపుడు జంతువులా తోక ఊపుతూ అనుసరించడం కనిపిస్తుంది. అంతేకాదు, ఆమె తన చేతులతో దట్టమైన బొచ్చు కలిగిన ఒక పునుగుపిల్లిని (Civet Cat) ఏమాత్రం భయం లేకుండా ఎత్తుకుని నడుస్తోంది. సాధారణంగా అడవిలో మనుషులను చూస్తే దాక్కునే లేదా ప్రతిఘటించే ఇటువంటి జంతువులు, ఆ చిన్నారి ప్రేమకు లోబడి ఆమె ఒడిలో ఎంతో శాంతంగా కూర్చోవడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ చిన్నారిని చూస్తుంటే నిజమైన ‘డిస్నీ ప్రిన్సెస్’లా ఉందని ప్రశంసిస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్న సమయంలో, ఇది బంగ్లాదేశ్‌కు చెందినదని కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారు. అయితే, దీనిపై విచారణ జరపగా, ఈ వీడియోను జూన్ నెలలో శ్రీలంకకు చెందిన ‘ప్రభత్ సిల్వా’ అనే ఫేస్బుక్ వినియోగదారుడు మొదట పోస్ట్ చేసినట్లు ధృవీకరించబడింది. ఆ వీడియోలో చిన్నారి మాట్లాడుతున్న భాష ‘సింహళ’ అని తేలడంతో, ఆమె శ్రీలంకలోని పొలోన్నరువా జిల్లాకు చెందినదని స్పష్టమైంది. అడవి అందాలను, చిన్నారి పవిత్రమైన ప్రేమను చాటిచెబుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తమ ప్రేమను కురిపిస్తున్నారు.
